PM Modi:పార్లమెంట్లో దాడిపై ప్రధాని మోదీ కీలక భేటీ.. భద్రతా సిబ్బందిపై వేటు..
Send us your feedback to audioarticles@vaarta.com
పార్లమెంట్లో బుధవారం జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ కీలక మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. పార్లమెంట్లో భదత్రా వైఫల్యం, మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.
మరోవైపు భద్రతా వైఫల్యంపై లోక్సభ సెక్రటేరియట్ చర్యలు చేపట్టింది. దాడి జరిగిన సమయంలో విధుల్లో ఉన్న ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సస్పెండ్ చేసిన వారిలో రాంపాల్, అరవింద్, వీర్ దాస్, గణేష్, అనిల్, ప్రదీప్, విమిత్, నరేంద్ర ఉన్నారు. ఇక దాడికి యత్నించిన ఆరుగురిలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరొక నిందితుడు కోసం గాలిస్తున్నారు. సాగర్ శర్మ(26), మనోరంజన్ డి (34), అమోల్ షిండే (25), నీలం వర్మ (42), విశాల్ శర్మగా గుర్తించారు. వీరిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. దాడికి 18 నెలల ముందుగానే ప్లాన్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దేశంలో నెలకొన్న కొన్ని కీలక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి చేసినట్టు వాళ్లు అంగీకరించినట్టు సమాచారం. నిరుద్యోగం, రైతుల సమస్యలు, మణిపూర్ హింస లాంటి అంశాలపై ఆ నిందితులు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్లో దాడి చేస్తే అప్పుడైనా తమ సమస్యలేంటో కేంద్ర ప్రభుత్వం తెలుసుకుని వాటిపై చర్చిస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేశామని చెప్పినట్లు చెబుతున్నారు. నిందితులంతా సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేరిట ఓ గ్రూప్ కూడా క్రియేట్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే భద్రతా ఏజెన్సీలు మాత్రం ఈ దాడి వెనకాల ఇంకేదైనా కుట్ర ఉందా అన్న కోణంలో విచారణ చేపడుతున్నాయి.
ఇదిలా ఉంటే దాడి నేపథ్యంలో పార్లమెంట్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ భవనంలోకి ప్రవేశాలపై కఠిన ఆంక్షలు విధించారు. ఎంపీలు ప్రవేశించే మెయిన్ గేట్ నుంచి ఇతరులు వెళ్లకుండా నిషేధం విధించారు. ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహించిన తర్వాతే మీడియా సిబ్బందికి పాసులు జారీ చేస్తున్నారు. అలాగే విజిటర్స్ నాలుగో గేట్ నుంచి మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. అలాగే విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ లోపలికి ఎవరూ వెళ్లకుండా అడ్డంగా గ్లాస్ ఏర్పాటుచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com