Modi:ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాని మోదీ హర్షం

  • IndiaGlitz, [Saturday,October 07 2023]

ఆసియా క్రీడల్లో భారత్ జట్టు విజయ దందుభి మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పతకాల వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే 100 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. 2018 ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలు మాత్రమే సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందిస్తూ దీన్ని చిరస్మరణీయ విజయంగా అభివర్ణించారు. ఆసియా క్రీడల్లో పతకాలను భారత్ కు తీసుకొచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు చిరస్మరణీయ విజయం. 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారతీయులు గర్వంగా ఫీలవుతున్నారు. ఈ చరిత్రాత్మక మైలురాయిని సాధించడానికి కారణమైన క్రీడాకరులకు నా హృదయపూర్వక అభినందనలు. ఆసియా క్రీడాకారుల బృందానికి ఈనెల 10న ఆతిథ్యం ఇచ్చేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.

25 బంగారు, 35 వెండి, 40 కాంస్య పతకాలు..

100 పతకాలు సాధించిన భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 25 బంగారు పతకాలు, 35 వెండి పతకాలు, 40 కాంస్య పతకాలు ఉన్నాయి. శనివారం ఉదయం ఆర్చరీ, మహిళ కబడ్డీలో భారత్ మూడు బంగారం పతకాలను కైవసం చేసుకుంది. ఆర్చరీ విభాగంలో జ్యోతి వెన్నమ్, ప్రవీణ ఓజస్ బంగారం పతకాలను గెలుచుకోగా.. భారత మహిళల కబడ్డీ జట్టు బంగారం పతకం సొంతం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో 100 పతకాలు చేరాయి. మరో రెండు రోజులు ఈవెంట్స్ ఉండటంతో పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అత్యధికంగా 354 పతకాలతో చైనా తొలి స్థానంలో ఉండగా.. జపాన్ 169, దక్షిణ కొరియా 170 పతకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

క్రికెట్ విభాగం ఫైనల్‌లో భారత్, ఆఫ్ఘాన్ అమీతుమీ..

మరోవైపు ఈ క్రీడల్లో భారత యువ క్రికెట్ జట్టు, ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో ఫైనల్‌లో తలపడుతుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచి గోల్డ్ మెడల్ సాధించాలని యువ భారత్ తహతహలాడుతోంది. అటు కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచులో పాకిస్తాన్‌ జట్టుపై బంగ్లాదేశ్‌ విజయం సాధించింది.