Prime Minister Modi:ప్రధాని మోదీ భారీ స్కెచ్.. యూపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి పేరు కొంతకాలంగా మార్మోగుతూనే ఉంది. ఇటీవల దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు దక్కడంతో సినీ, రాజకీయ ప్రముఖల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. తాజాగా మరో వార్త హల్‌చల్ చేస్తోంది. యూపీ నుంచి రాజ్యసభకు చిరంజీవిని నామినేట్ చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రధాని మోదీ.. చిరంజీవికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు.
మోదీ మార్క్ రాజకీయం..
రెండు సంవత్సరాల క్రితం ఏపీలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ కన్నా చిరుకు ప్రధాని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే గోవాలో జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అయోధ్య రామమందిరానికి ఆహ్వానించడం, పద్మవిభూషణ్ పురస్కారం ఇవ్వడం వంటి పరిణామాలను గమనిస్తే చిరంజీవిని దగ్గరికి తీసుకునేందుకు మోదీ మార్క్ రాజకీయం కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పవన్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకునేలా..
ముఖ్యంగా ఏపీలో సొంతంగా బలపడటానికి ప్రయత్నాలు చేస్తు్న్నారు. ఇందులో భాగంగానే బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవికి ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. ఇదే క్రమంలో ప్రస్తుతం టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బయటకు తీసుకొచ్చి తమతోనే ఉండే వ్యూహంలో కూడా భాగమంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభకు నామినేట్ చేయాలని ఆలోచనకు వచ్చారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే రాష్ట్రపతి కోటాలో చిరును రాజ్యసభకు నామినేట్ చేయాలని చూడగా.. ఈ ఆఫర్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించనట్టు సమాచారం. దీంతో రాజమౌళి తండ్రి ప్రముఖ రచయత విజయేంద్ర ప్రసాద్‌ను పెద్దల సభకు నామినేట్ చేశారు.
కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారా..?
తాజాగా త్వరలోనే 15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 56 మంది రాజ్యసభ సభ్యుల ఎంపికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10 స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాలను గెలుచుకునే బలం బీజేపీకి ఉంది. దీంతో యూపీ నుంచి చిరంజీవిని పెద్దల సభకు పంపించాలని భావిస్తున్నారట. అంతేకాకుండా మూడో సారి మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రివర్గంలోకి కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికై కేంద్రమంత్రిగా చిరంజీవి పనిచేశారు. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. అయితే ఆయనకు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం ఉంది. మరి ఈ నేపథ్యంలో చిరంజీవి.. హస్తం పార్టీకి రాజీనామా చేస్తారా..? బీజేపీ ఆఫర్‌ను స్వాగతించి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా..? తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments