Modi:కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుంటోందని విమర్శించారు. బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మకయ్యాయని.. లిక్కర్ స్కామ్‌లోనూ బీఆర్ఎస్ కమీషన్లు తీసుకుందని ఆరోపణలు చేశారు.
తెలంగాణలో దోచుకున్న డబ్బులు ఢిల్లీలో కుటుంబ పార్టీ పెద్దలకు వెళ్తున్నాయని ఆరోపించారు. దేశంలో జరిగిన స్కామ్‌లన్నింటికీ కుటుంబ పార్టీలే కారణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడిందన్నారు. తెలంగాణను దోచుకున్న వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని హెచ్చరించారు. తెలంగాణలో ఎన్నో వేల కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని.. పసుపు బోర్డు తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోతున్నాయని.. అదే సమయంలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందన్నారు.
తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే.. తనకు అంత శక్తి వస్తుందన్నారు. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని.. భారత్ అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు. మే 13న జరిగే పోలింగ్‌లో తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని.. వికసిత్ భారత్ కోసం రాష్ట్ర ప్రజలు ఓటు వేయబోతున్నారని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్.. 400 పార్ అంటున్నారని.. ఈ సారి పక్కాగా 400 సీట్లు సాధిస్తామన్న ధీమాను మోదీ వ్యక్తం చేశారు.
ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపైనా మోదీ విమర్శలు గుప్పించారు. భారత్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తన పోరాటం శక్తికి వ్యతిరేకం అని చెప్పారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరగబోతుందన్నారు. శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ ఛాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. చంద్రయాన్ విజయంలో నారీ శక్తి పాత్ర కీలకమని.. అందుకే ఆ ప్రాంతానికి కూడా శివశక్తి అని పేరు పెట్టామన్నారు. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో.. జూన్ 4వ తేదీన తెలుస్తుందని మోదీ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments