Modi:దేశాన్ని విభజించే కుట్రలను సహించేది లేదు.. ప్రధాని మోదీ ఫైర్..
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడారు. చూస్తుండగానే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దిగజారిపోయిందని విమర్శించారు. దేశాన్ని మరోసారి విభజించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని.. ఉత్తరం, దక్షిణం అంటూ విడదీసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కొంతమంది మా రాష్ట్రం మా పన్నులు అంటూ మాట్లాడుతున్నారని... అసలు ఇదేం వితండవాదం? అని ప్రశ్నించారు. దేశాన్ని విభజించే కుట్రలను సహించేది లేదని హెచ్చరించారు. భారత్ అంటే ఢిల్లీ ఒక్కటే కాదని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ దేశ ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 40 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓ ఆంగ్లేయుడు స్థాపించారని.. ఇప్పటికీ ఆ పార్టీపై బ్రిటిషర్ల ప్రభావం ఉందని వ్యాఖ్యానించారు. భారతీయ భాషలను చిన్నచూపు చూసి ఇంగ్లీష్‌ను ప్రోత్సహించారని ఆరోపించారు. బ్రిటిష్ ఎలా నడిస్తే అలా భారత పార్లమెంట్‌ను నడిపారని మండిపడ్డారు. ఆ బానిసత్వ గుర్తులను తాము చెరిపేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ విదేశీ వస్తువులను ప్రోత్సహిస్తే తాము మాత్రం మేకిన్ ఇండియాను ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
అలాగే దళితులు అంటే ఆ పార్టీకి గిట్టదని ఆరోపించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కేవి కాదని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారని వ్యతిరేకించారని ఆరోపించారు. రిజర్వేషన్లు దేశాన్ని అస్థిరపరుస్తాయని ఆయన వ్యాఖ్యానించారని.. ఇందుకు సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వలేదని తమ హయాంలోనే భారతరత్న ఇచ్చామని గుర్తు చేశారు. అలాగే తొలిసారి ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేసింది బీజేపీ అని పునరుద్ఘాటించారు.
యూపీఏ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందన్నారు. ఈ పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను తాము ఐదో స్థానానికి తీసుకువచ్చామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పురోగతిని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ప్రశంసించారని గుర్తుచేశారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తున్నారని విమర్శలు చేస్తున్నారని కానీ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ను ఎవరు నాశనం చేశారు? అని ప్రశ్నించారు. హెచ్ఏఎల్, ఎయిరిండియాను ఎవరు దెబ్బతీశారు? అని నిలదీశారు. ఎల్ఐసీ మూత పడుతుందని విమర్శలు చేశారని.. ఇప్పుడు ఎల్ఐసీ షేర్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయని మోదీ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments