Modi:రష్యాలో ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ.. ముందే హెచ్చరించిన అమెరికా..

  • IndiaGlitz, [Saturday,March 23 2024]

రష్యాలోని మాస్కో(Mascow)లో జరిగిన ఉగ్రవాదుల దాడి(Terror Attack) పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని.. భారత్ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడుతుందని స్పష్టంచేశారు. రష్యాకి తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాస్కోలో జరిగిన ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. ఈ విపత్కర సమయంలో రష్యా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు మేం అండగా నిలబడతాంఅని ట్వీట్ చేశారు.

మరోవైపు ఈ ఉగ్రదాడి ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే రష్యాను హెచ్చరించినట్లు తెలిపింది. వైట్‌హౌస్‌ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియెన్నీ వాట్సన్‌ మాట్లాడుతూ.. మాస్కోలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే అమెరికా ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని తెలిపారు.. కాన్సర్ట్‌లు, ప్రజలు ఎక్కువగా గుడిగూడే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరగొచ్చని రష్యా అధికారులను హెచ్చరించినట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మాస్కోలో జరిగిన దాడులకు తామే బాధ్యులమంటూ ఉగ్ర సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఐసిస్‌కు అనుబంధంగా ఉండే న్యూస్ ఏజన్సీ అమఖ్ తమ టెలిగ్రామ్ చానల్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టలేదు. ఇటు దాడి ఎవరు చేశారనే దానిని రష్యా ఇంతవరకూ అధికారికంగా ధృవీకరించలేదు. అలాగే అధ్యక్షులు పుతిన్ కూడా దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు.

అసలు ఏం జరిగిందంటే శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో మాస్కోలో భారీ ఉగ్రదాడి జరిగింది. క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి(Crocus City Hall) ఐదుగురు దుండగులు ప్రవేశించారు. వస్తూ వస్తూనే ప్రజలపై మిషన్ గన్లతో కాల్పులకు తెగబడ్డారు. దీంతో సుమారు 60 మంది మృతిచెందారు. మరో 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ఫిక్‌నిక్‌ మ్యూజిక్ కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఈ భారీ ఉగ్రదాడి ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. గత 20 ఏళ్లలో రష్యాలో జరిగిన భారీ ఉగ్రదాడి ఇదే కావడం గమనార్హం.