Prime Minister Modi :హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే..

  • IndiaGlitz, [Tuesday,November 07 2023]

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. పోటాపోటీ ప్రచారాలతో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన అగ్ర నేతలు బహిరంగసభల్లో పాల్గొంటూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న‘బీసీ ఆత్మగౌరవ సభ’లో పాల్గొననున్నారు.

మోదీ హైదరాబాద్‌ షెడ్యూల్..

సాయంత్రం 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రాక
సా. 5.25గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరిక
సా. 5.30 నుంచి 6.10 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగం
6.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం
అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ పయనం

బీసీ ఆత్మగౌరవ సభను కమలం పార్టీ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించకుంది. ఈ సభలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కూడా ఈ సభలో పాల్గొననున్నారు. 2014 ఎన్నికల ప్రచారం తర్వాత మోదీ, పవన్ ఒకే వేదికపై ఆశీనులు కానుండడం విశేషం.

మరోవైపు మోదీ పర్యటనకు మందుకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారంటూ ఆ పార్టీ జాతీయ నేత మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజయ్ సీఎం రేసులో ఉన్నారు కాబట్టే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి రేసులో లేరని.. అందుకే ఆయనకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినట్ స్పష్టం చేశారు.తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.