Prime Minister,Tamil Nadu CM:సీఎం జగన్‌పై రాళ్ల దాడిని ఖండించిన ప్రధాని, తమిళనాడు సీఎం

  • IndiaGlitz, [Sunday,April 14 2024]

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ప్రధాని మోదీ పాటు ఇతర రాష్ట్రాల నాయకులు కూడా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమైన చర్య అని అభివర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికమైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. అంతేకాకుండా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇక సీఎం జగన్ పై రాయి దాడిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదన్నారు. ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని పరస్పరం కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ దాడిని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. 'జాగ్రత్తగా ఉండాలి జగన్ అన్న. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు, హింసకు తావు లేదు. ఇలాంటి ఘటనలు నివారించడానికి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి' అని ట్వీట్ చేశారు.

మరో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం జగన్‌పై రాయి దాడి హేయమైన చర్య అని, ప్రజాస్వామ్యంలో హింసవు తావు లేదని.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు వైసీపీ నేతలు అయితే ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో జగన్ బస్సు యాత్రకు వస్తోన్న విశేష ఆదరణ చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందని.. అందుకే ఇలాంటి దాడులకు ప్రేరేపిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఓటు అనే అస్త్రం ఉపయోగించి ప్రజలు టీడీపీకి తగిన బుద్ది చెబుతారని హెచ్చరిస్తున్నారు.