‘‘విరాట్’’ సేవలకు ఇక విశ్రాంతి.. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ వీడ్కోలు
- IndiaGlitz, [Wednesday,January 26 2022]
73వ గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ‘విరాట్’కు వీడ్కోలు పలికారు. ఇంతకీ ఈ విరాట్ ఎవరో తెలుసా. ప్రెసిడెంట్ బాడీగార్డ్స్ దళంలో సేవలందించిన ఒక అశ్వం. ఇది ఇప్పటి వరకు 13 సార్లు గణతంత్ర దినోత్సవ పరేడ్‌లలో పాల్గొంది. వయసు పెరుగుతుండటంతో దీని సేవలకు ప్రభుత్వం ముగింపు పలికింది.
పరేడ్ ముగిసిన అనంతరం రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విరాట్ దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా నిమిరి తుది వీడ్కోలు పలికారు. దీని సేవలకు గుర్తుగా.. జనవరి 15న ఆర్మీ డే సందర్భంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ లభించింది. ఈ అశ్వం అసాధారణ సేవలు, సామర్థ్యం ఆధారంగా ఈ కమెండేషన్ (ప్రశంస) దక్కింది. ఈ తరహా గుర్తింపు పొందిన మొదటి అశ్వం ఇదొక్కటే.
ఉత్తరాఖండ్‌లోని హెంపూర్‌లో ఉన్న రీమౌంట్ ట్రైనింగ్ స్కూల్ అండ్ డిపోలో కఠోర శిక్షణ పొందిన విరాట్ మూడేళ్ల వయసులో 2003లో రాష్ట్రపతి బాడీగార్డ్స్ విభాగంలో ప్రవేశించింది. నాటి నుంచి నేటివరకు 13సార్లు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంది. రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతికి ఎస్కార్ట్‌గా వ్యవహరించడంతోపాటు.. రాష్ట్రపతి భవన్‌ను సందర్శించిన వివిధ దేశాల అధినేతలకు ఆహ్వానం పలికింది.
హనోవేరియన్ బ్రీడ్‌కు చెందిన విరాట్.. రాష్ట్రపతి రక్షణ దళంలో కీలక పాత్ర పోషించింది. అందుకే దాన్ని అధికారులు ముద్దుగా ‘ఛార్జర్’ అని పిలుస్తారు. పరేడ్‌లో అత్యంత నమ్మకమైన అశ్వంగా విరాట్ గుర్తింపు తెచ్చుకుంది. ఇన్నేళ్లు రాష్ట్రపతి బాడీగార్డ్ విభాగంలో పని చేసినప్పటికీ.. ఒక్కసారి కూడా విరాట్ దురుసుగా ప్రవర్తించలేదని అధికారులు చెబుతున్నారు.