గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరం: కోవింద్
- IndiaGlitz, [Friday,January 29 2021]
పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి నేడు రాష్ట్రపతి కోవింద్ ప్రసంగించారు. కోవిడ్ సహా అనేక సమస్యల్ని ప్రజలు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా కోవింద్ పేర్కొన్నారు. కోవిడ్, ఇతర సమస్యలపై దేశం ఐకమత్యంగా పోరాడామన్నారు. కరోనాతో ఆరుగురు ఎంపీలు మృతిచెందడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సమస్య ఉందన్నారు. భారత్ సమర్థంగా ఎదుర్కొని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా ఎందరో మహనీయుల్ని బలితీసుకుందని పేర్కొన్నారు. 6 రాష్ట్రాల్లో గ్రామీణ్ గరీభ్ కళ్యాణ్ యోజన అమలు చేశామన్నారు. 14 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని రాష్ట్రపతి వెల్లడించారు.
ఆత్మనిర్భర్ భారత్ ఎంతో ప్రతిష్టాత్మకమని రాష్ట్రపతి కోవింద్ తెలిపారు. మానవత్వంతో కరోనా వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపించామన్నారు. పేదల కోసం వన్ నేషన్.. వన్ రేషన్ అమలు చేశామన్నారు. జన్‌ధన్ యోజన ద్వారా నేరుగా అకౌంట్లలోకి నగదు బదిలీ చేస్తామన్నారు. ఆరోగ్య పరిరక్షణ చర్యలు పేదలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. తక్కువ ధరల్లో పేదలకు ఔషధాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. దేశంలో 50 వేలకు పైగా మెడికల్ సీట్లు పెరిగాయని కోవింద్ పేర్కొన్నారు. ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. చిన్న, మధ్యతరగతి రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్రపతి కోవింద్ తెలిపారు.
గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరమన్నారు. పరిశ్రమల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. పశువుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కోవింద్ పేర్కొన్నారు. పశుధన్ పథకం ప్రతి ఏడాది 8.2 శాతం వృద్ధి చెందుతోందన్నారు. గ్రామీణులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నామన్నారు. దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌లకు ఆమోదం తెలిపామన్నారు. రైతుల ప్రయోజనాలకు 3 సాగు చట్టాలను తీసుకొచ్చామని కోవింద్ తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో లేకుండా చూశామన్నారు. 80 కోట్ల మందికి 8 నెలల పాటు 5 కిలోల బియ్యం ఇచ్చామన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో మహిళల పాత్ర కీలకమని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు.