NTR100 Rupees Coin:రూ.100 ఎన్టీఆర్ నాణెం విడుదల .. ఢిల్లీ ఘనంగా కార్యక్రమం, హాజరైన అన్నగారి కుటుంబం
- IndiaGlitz, [Monday,August 28 2023]
టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్మారకార్ధం కేంద్ర ప్రభుత్వం నాణెం విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ ముఖ చిత్రం వున్న రూ.100 నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. షూటింగ్‌లో పాల్గొన్నందున జూనియర్ ఎన్టీఆర్, పాదయాత్రలో వున్నందున టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పురాణ పాత్రలకు ప్రాణం పోశారన్న రాష్ట్రపతి:
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరిట రూ.100 నాణెం విడుదల చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ ప్రతిపాదించడం గొప్ప విషయమన్నారు. ఆయన కుమార్తె పురందేశ్వరి అన్నీ తానై చూసుకున్నారని.. తెలుగు సినిమా ద్వారా భారతదేశ సంస్కృతిని ఆయన చాటి చెప్పారని రాష్ట్రపతి ప్రశంసించారు. రామాయణ, మహాభారతాలను పాత్రలకు ఆయన తన నటనతో ప్రాణం పోశారని.. రాముడు, కృష్ణుడి చరిత్రను అందరికి తెలియజేశారని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎన్టీఆర్ తరతరాలకు హీరో అని అన్నారు. శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు. ఎన్టీఆర్ పేరిట నాణెం విడుదల చేయాలన్న ఆలోచన రావడం గొప్పదన్నారు.
ఎన్టీఆర్ నాణెం ఇలా :
కాగా.. రూ.100 ఎన్టీఆర్ నాణెం విషయానికి వస్తే 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో రూపొందించారు. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్ , 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఎన్టీఆర్ నాణేనికి ఓ వైపు భారత ప్రభుత్వ చిహ్నాం మూడు సింహాలు, అశోక చక్రం వుండగా.. మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, దానికి నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీలో వ్రాశారు.