ప్రి వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధూవరులిద్దరూ మృతి
- IndiaGlitz, [Thursday,November 12 2020]
ఐదేళ్ల ప్రేమకు పెద్దలు కూడా రైట్ కొట్టారు. దీంతో ఆ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. ఇరువైపుల పెద్దలూ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 22న ఈ జంట పెళ్లికి సుముహూర్తం నిశ్చయమైంది. ప్రపంచాన్ని జయించినంతగా ఆనందపడ్డారు. అక్కడి నుంచి పెళ్లి అయ్యేంత వరకూ ప్రతి ఒక్క వేడుకనూ కెమెరాలో బంధించి మధురానుభూతులను జ్ఞాపకాల రూపంలో పదిలపరుచుకోవాలనుకున్నారు. కానీ అవే వారి కుటుంబాలకు చివరి స్మృతులవుతాయని కలలో కూడా ఊహించి ఉండరు.
కర్ణాటకలోని మైసూరుకు చెందిన చంద్రు(28) సివిల్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. చంద్రు.. శశికళ(21) అనే యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువైపుల పెద్దలూ ఓకే చెప్పడంతో పాటు ఈ నెల 21న పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. దీంతో ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలని భావించింది. దీనికోసం కావేరి నదికి వెళ్లి.. బోటులో నది మధ్యలోకి వెళ్లి ఫోటోలకు ఫోజులిస్తుండగా.. ప్రమాదవశాత్తు ఆ బోటు నీటిలో పడిపోయింది. ఫోటోగ్రాఫర్ స్టిల్స్ తీస్తుండగానే అంతా జరిగిపోయింది. వెంటనే చంద్రు.. శశికళను కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. చూస్తుండగానే ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
నవంబర్ 22న మైసూరులో చంద్రు, శశికళల వివాహం అంగరంగ వైభవంగా చేయాలనుకున్నామని.. ఇంతలోనే ఈ ఘటన తీరని శోకాన్ని మిగిల్చిందని కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ఆవేదనకు గురవుతు్నారు. ఫోటో షూట్ నిమిత్తం నది ఒడ్డు నుంచి సుమారు 30 మీటర్ల లోపలకు వెళ్లి.. ఫొటోకు ఫోజిచ్చినట్లు పోలీసులు విచారణలో తేలింది. కాగా.. శశికళ హైహీల్స్ శాండిల్స్ వేసుకోవడం వల్లే ఆమె బోటుపై నిల్చునే క్రమంలో అదుపుతప్పి నీటిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ఆమెను కాపాడే క్రమంలో చంద్రు కూడా నీటిలో పడిపోయాడని.. పోలీసులు వెల్లడించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో చంద్రు, శశికళల మృతదేహాలను కావేరి నది నుంచివెలికితీశారు.