YSRCP : ఫ్యాన్‌కి ఓటేయ్యకపోతే పెన్షన్లు ఆగిపోతాయి.. ఓటర్లను బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యే , ట్రోలింగ్

  • IndiaGlitz, [Friday,October 07 2022]

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నియోజకవర్గాల్లో నేతల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా వుంటోంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ .. జగన్ మాత్రం జనాల్లోకి వెళ్లాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమై.. అంతిమంగా పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వుంటోంది.

పెన్షన్లు, ఇళ్లు వైసీపీయే ఇచ్చింది.. మాకు ఓటేయ్యకపోతే:

తాజాగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ శంఖవరం మండలం అన్నవరం వెల్లంపేటలో గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళుతూ.. ప్రభుత్వం అందించిన పథకాలను వివరిస్తూ ప్రసాద్ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఓ చోట కొందరు మహిళలతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యాలని, లేకపోతే పింఛన్లు ఆగిపోతాయని హెచ్చరించినట్లుగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు, నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.

వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్:

ఇకపోతే... గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై గత నెలలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన వర్క్‌షాపులో ఎమ్మెల్యేలు, మంత్రులకు జగన్ క్లాస్ తీసుకున్నారు. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే తిరగాలని.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు కాదని సీఎం హెచ్చరించారు. తూతూ మంత్రంగా తిరిగితే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్ధితులు వస్తాయని జగన్ అన్నారు.