Prashanth Kishore: టీడీపీకి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబును అందుకే కలిశానని క్లారిటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor)గురించి ఏపీ ప్రజలకు బాగా సుపరిచితం. ఐప్యాక్ సంస్థ నేతృత్వంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పనిచేశారు. ఆయన వ్యూహాలతో ఆ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆయన సేవలు అందించిన మెజార్టీ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. దీంతో పీకే పేరు మార్మోగుతోంది. అయితే కొంతకాలంగా రాజకీయాలపై మక్కువతో ఐప్యాక్ సంస్థకు దూరంగా ఉంటున్నారు. బిహార్‌లో జనసురాజ్ పార్టీని పెట్టి అక్కడి రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
గతంలో చంద్రబాబుతో పీకే భేటీ..
అయితే ఐప్యాక్‌లో పనిచేసిన కొందరు మాత్రం ఇప్పటికీ వైసీపీ కోసం పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ నెలలో నారా లోకేష్‌తో కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు (Chandrababu) నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. దీంతో టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నట్లు జోరుగా వార్తలు ఊపందుకున్నాయి. ఆయన మాత్రం దేశంలోనే సీనియ రాజకీయ నేత కావడంతోనే చంద్రబాబుతో భేటీ అయినట్లు వెల్లడించారు. దీంతో కొన్ని రోజులుగా జరిగిన ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
ఏ పార్టీ తరపున పనిచేయడం లేదు..
తాజాగా ఓ హిందీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబును కలవడానికి గల కారణాలపై స్పందించారు. రాజకీయంగా బిగ్ షాట్ అయిన ఓ వ్యక్తి తనకు, చంద్రబాబుకు కామన్ ఫ్రెండ్‌గా ఉన్నారని తెలిపారు. ఆయన ఒత్తిడితోనే చంద్రబాబును కలిశానని స్పష్టంచేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని ఆ పార్టీ విజయం సాధించిందన్నారు. ప్రస్తుతం ఏపీలో ఏ పార్టీ కోసం తాను పనిచేయడం లేదని.. అక్కడి రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన స్వరాష్ట్రం బిహార్ రాజకీయాల మీదే పూర్తిగా దృష్టి పెట్టానని వివరించారు. మొత్తానికి టీడీపీతో పాటు వైసీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేయడం లేదనే క్లారిటీ మాత్రం వచ్చేసింది.
వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..
మరో రెండు నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో ఏపీలో రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. వ్యూహాలు ప్రతివ్యూహాలతో అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల బరిలో దిగాయి. ఓవైపు టీడీపీ-జనసేన ఉమ్మడిగా పోరాడుతుంటే.. అధికార వైసీపీ మాత్రం ఒంటరిగానే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే నాలుగు విడతల్లో 58 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. మరికొన్ని రోజుల్లోనే మిగిలిన అభ్యర్థులను కూడా ప్రకటించనుంది. ఇక టీడీపీ-జనసేన కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం.. వైసీపీ నుంచి కీలక నేతలు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం కావడంతో హస్తం పార్టీ కూడా రేసులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments