Prashant Kishore:జగన్‌కు భారీ ఓటమి తప్పదన్న ప్రశాంత్ కిషోర్.. వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం..
- IndiaGlitz, [Monday,March 04 2024]
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. గతంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారని.. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సైతం తప్పుడు జోస్యం చెప్పి సన్యాసానికి సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలకు ఎల్లో మీడియా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. బీహార్‌లో పీకే చెల్లని రూపాయి.. ఏపీలో చంద్రబాబు చెల్లని రూపాయి అంటూ ఎద్దేశా చేశారు. గడిచిన 5 సంవత్సరాలలో సంక్షేమ కార్యక్రమాల కోసం రెండున్నర లక్ష కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని.. పేదలందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చేసిందన్నారు. ఈ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేయరంటూ పీకే చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. సంక్షేమం చేయని చంద్రబాబు ఏ విధంగా గెలుస్తాడని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు? ఈయన ఏమైనా మాంత్రికుడా? మాయల ఫకీరా అని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ మాటలను ప్రజలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
కాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని.. భారీ తేడాతో ఓడిపోతుంద వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ప్యాలెస్‌లో ఉంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కాదని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాల కల్పన చేయాలన్నారు. జగన్ పెద్ద తప్పు చేశారని.. దీంతో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండిస్తుంటే.. ప్రతిపక్ష నేతలు వైరల్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో ఐప్యాక్ ఇంఛార్జ్‌గా ప్రశాంత్ కిషోర్ వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. తన వ్యూహాలతో గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో వైసీపీకి ఘన విజయం తెచ్చి పెట్టారు. అనతంరం ఢిల్లీ, కోల్‌కతా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పీకే అంచనాలు నిజమయ్యాయి. తాజాగా త్వరలో జరగనున్న ఏపీ ఎన్నిక్లలో జగన్ పార్టీ భారీ తేడాతో ఓటమి చెందుతుందని అంచనా వేశారు. మరి ఆయన అనుకున్నట్లు వైసీపీ భారీ తేడాతో ఓడిపోతుందో లేదో తెలియాంటో మరో రెండు నెలలు ఆగాల్సిందే.