‘పీకే’ను జేడీయూ నుంచి పీకేశారు!
- IndiaGlitz, [Wednesday,January 29 2020]
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు జేడీయూ ఊహించని షాకిచ్చింది. జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఉపాధ్యక్షుడుగా ఉన్న పీకేను ఆ పార్టీ పీకేసింది.! గత కొన్ని రోజులుగా పార్టీకి వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జేడీయూ నుంచి ప్రశాంత్ కిషోర్‌ను బహిష్కరిస్తున్నట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆయనతో పాటు మరో నేత పవన్ వర్మపై కూడా ఆ పార్టీ వేటు వేసింది. ఇందుకు స్పందించిన పీకే.. ‘థాంక్యూ నితీశ్ కుమార్.. మీరు మరోసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’ అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ఆయన ట్వీట్ వెనుక అర్థం, పరమార్థం ఆయనకే ఎరుక..!
అసలేం జరిగింది!?
కాగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో పాటు దేశంలో పలు రాజకీయ పార్టీలకు పీకే వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని మొదట్నుంచి పీకే వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. జేడీయూ- బీజేపీ మిత్ర పక్షంతో అధికారంలో కొనసాగుతుందన్న విషయాన్ని పట్టించుకోకుండా.. మిత్రపక్షాన్ని ఎడాపెడా తిట్టేయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అధిష్టానం సీరియస్ అయ్యింది. ఒకట్రెండు సార్లు చీవాట్లు కూడా పెట్టింది. అయినప్పటికీ పీకేలో ఎలాంటి మార్పు రాలేదు. ఇలా పార్టీ అధినేత, సీఎం నితీశ్ కుమార్.. పీకే మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. ఈ క్రమంలో జేడీయూలో కొనసాగాలంటే పార్టీలోకి నిబంధనలు, విధానాలకు లోబడి పనిచేయాలని.. లేనట్లయితే పార్టీని వీడవచ్చంటూ పీకేకు నితీశ్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ పీకేలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఇక చేసేదేమీ లేక.. బీజేపీకి ఏమీ చెప్పుకోలేక పీకేను తొలిగిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
‘పీకే’సి తప్పు చేశారా!?
వాస్తవానికి ఇప్పుడు నితీశ్ కుమార్ సీఎం సీటులో కూర్చోవడానికి కర్త, కర్మ, క్రియ పీకేనని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే.. అలాంటి వ్యూహకర్తను గుర్తించి తన పార్టీలో అధ్యక్ష పదవి కట్టబెట్టిన నితీశ్.. బీజేపీ మెప్పుకోసం పెద్ద తప్పే చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బహుశా నితీశ్ మున్ముంథు భారీ మూల్యం చెల్లించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ‘పీకే’సిన తర్వాత కూడా ‘థాంక్యూ నితీశ్ కుమార్.. మీరు మరోసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’ అని పీకే అన్నారంటే.. దీని వెనుక అర్థం రానున్న ఎన్నికల్లో మీ సత్తా చూస్తామనా..? లేకుంటే ఇంకేమైనా ఉందా..? అనేది నితీశ్, ప్రశాంత్‌కే తెలియాలి మరి.