మరింత విషమించిన ప్రణబ్ ఆరోగ్యం..
- IndiaGlitz, [Wednesday,August 19 2020]
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత విషమించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రణబ్ కుమారుడు అభిజిత్ తన తండ్రి ఆరోగ్యం మెరుగైందని వెల్లడించిన కాసేపటికే హెల్త్ బులిటెన్‌ను ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. ప్రణబ్ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఏర్పడిందని.. ఈ కారణంగా పరిస్థితి మరింత విషమించిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ‘ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఓ ప్రత్యేక వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది.’’ అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
గత పది రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ప్రణబ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్‌కు శస్త్రచికిత్స చేశారు. అంతకు ముందు నిర్వహించిన పరీక్షలో తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రణబ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనతో కాంటాక్ట్‌లో ఉన్నవారంతా పరీక్ష చేయించుకోవాలని ఆయన కోరారు. అయితే ప్రణబ్‌కు శస్త్ర చికిత్స నిర్వహించిన అనంతరం నుంచి పరిస్థితి విషమంగా ఉంటోంది. నేడు మరింత క్షీణించింది.
అయితే ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయడానికి ముందు ప్రణబ్ కుమారుడు అభిజిత్ ట్విట్టర్ వేదికగా తన తండ్రి ఆరోగ్యం మెరుగవుతోందని వెల్లడించారు. తాను ఆసుపత్రిలో ఉన్న తన తండ్రిని కలిశానని.. మునుపటి కన్నా ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని వెల్లడించారు. చికిత్సకు సైతం స్పందిస్తున్నారని అభిజిత్ వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం మెరుగవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు.