ప్రకాష్ రాజ్ మొబైల్ వెజిటెబుల్ స్టోర్
- IndiaGlitz, [Wednesday,March 09 2016]
ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా మనం తినే ఆహారంలో చాలా మార్పులే వచ్చాయి. ప్రజలు ఎక్కువగా కెమికల్ ఫుడ్ ను కాకుండా ఎలాంటి రసాయనాలు ఉపయోగించని ఆర్గానిక్ ఫుడ్ ను తీసుకుంటున్నారు. సామాన్య ప్రజలకు కూడా ఇలాంటి ఆర్గానికి ఫుడ్ ను అందించడానికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ముందుకొచ్చారు. ప్రకాష్ రాజ్ తన పేరిట నెలకొల్పిన ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ తరపున తెలంగాణాలోని కొండరెడ్డి పల్లిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ గ్రామంలో తన పొలం తీసుకుని వ్యవసాయం చేసి ఆర్గానిక్ కాయగూరలను పండించిన ప్రకాష్ రాజ్ వీటిని సినిమా పరిశ్రమలో క్రిందిస్థాయిలో పనిచేసే కార్మికులకు అందచేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకు అనుగుణంగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఓ మొబైల్ స్టోర్ ను ప్రారంభించనున్నారు. ఈ స్టోర్, ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా రేపు సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ హీరోలు, హీరోయిన్స్, ఇండస్ట్రీ ప్రముఖులు హాజరవుతున్నారు.