Bhatti Vikramarka:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్
- IndiaGlitz, [Wednesday,December 13 2023]
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ అధికారిక నివాసంగా ఉండేది. ఇక్కడి నుంచే ఆయన పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ సమీక్షలు నిర్వహించేవారు. దీంతో మంత్రులు, పార్టీ నేతలు, ఉన్నతాధికారుల రాకపోకలతో అది ఎప్పుడూ బిజీగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన ప్రగతిభవన్ ఖాళీ చేయాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రగతిభవన్ ముందున్న ఇనుప కంచెలన అధికారులు తొలగించారు.
అనంతరం దాని పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా మార్చారు. అప్పటి నుంచి అక్కడ ప్రజల సమస్యలు వినేలా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తొలిరోజు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి మరి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. తర్వాత మంత్రులు, అధికారులు వినతులు స్వీకరిస్తున్నారు. ఇక నుంచి వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు.
తాజాగా ప్రజాభవన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రజా భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కేటాయించింది. ఇక నుంచి అది ఆయన అధికారిక నివాసం కానుంది. త్వరలోనే కుటుంబంతో సహా ఆయన ఇక్కడికి షిఫ్ట్ కానున్నారు. అధికారిక కార్యక్రమాలన్నింటినీ ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవోను విడుదల చేశారు. మరి ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారా..? లేదా..? అనే సందేహం నెలకొంది.