YS Jagan: అంటరానితనం రూపు మార్చుకుంది.. సీఎం జగన్ ప్రసంగంపై ప్రశంసలు..
Send us your feedback to audioarticles@vaarta.com
విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహంగా పేరు గడించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సామాజిక సమతా సంకల్ప సభలో జగన్ ప్రసంగం అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా అంటరానితనం ఇంకా ఉందని గుర్తుచేశారు. అయితే ఇది ఇప్పుడు రూపు మార్చుకుందన్నారు.
పెత్తందారీ వ్యవస్థపై ఆగ్రహం..
పేదలు చదివే స్కూళ్లను పట్టించుకోకపోవడం అంటరానితనమే.. పేద పిల్లలకు ట్యాబులు ఇస్తుంటే వికృత రాతలు రాయడం కూడా అంటరానితనమే.. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే.. పేదలు ప్రయాణించే ఆర్టీసీని .. పేదప్రజలు వచ్చే ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేయడం కూడా అంటరానితనమే అంటూ రాష్ట్రంలో పెత్తందారి వ్యవస్థను ఆయన ఎండగట్టారు. చంద్రబాబుకు దళితులంటే ఇష్టం ఉండదని.. అందుకే తన హయాంలో ఏనాడూ అంబేద్కర్ విగ్రహం కట్టడం గురించి ఆలోచించలేదని దుయ్యబట్టారు.
యల్లో మీడియా రాతలపై ఫైర్..
అంబేద్కర్ చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలోనే.. కానీ ఈ పెత్తందారుల పత్రిక ఒకటి తెలుగులోనే చదువుకోవాలని అంబేద్కర్ చెప్పారని రాశారని విమర్శించారు. చరిత్రను వక్రీకరించే వాళ్లు ఈ స్థాయికి దిగజారంటే ఏ స్థాయికి పాత్రికేయం పడిపోయిందనే బాధ వేస్తుందన్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంను దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. పేద పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? ఇలాంటి ఆలోచనలు కూడా అంటరానితనమే అని చెప్పవచ్చు అంటూ ఎల్లో మీడియా రాస్తున్న రాతలపై ఆయన విరుచుకుపడ్డారు. అంబేద్కర్ భావజాలం ఈ పెత్తందారులకు అస్సలు నచ్చదని విమర్శలు చేశారు.
మీకు అండగా నేనుంటాను..
"ఇక మీదట వారి పోకడలు చెల్లవు.. మీకోసం మీ జగన్ ఉన్నాడు.. మీకు అండగా నేనుంటాను. బడుగు వర్గాల కోసం మహనీయుడు అంబేదర్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం"అని అణగారిన వర్గాలకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ వచ్చాకే బలహీనవర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత దక్కిందన్నారు. శాసన మండలిలో 29 మంది సభ్యులు బలహీన వర్గాలకు చెందిన వారే.. ఎనిమిది మందిని రాజ్యసభకు పంపింతే అందులో సగం ఎస్సీ, బీసీలే.. 13 జడ్పీ ఛైర్మన్లలో 9 మంది బలహీన వర్గాల వారేనన్నారు. తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవాలని జగన్ వివరించారు.
పెత్తందారులకు దళితులంటే చులకన..
అంబేద్కర్ అంటే పెత్తందారులకు అసహ్యమన్నారు. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదని మండిపడ్డారు. పెత్తందారీ పార్టీలకు , పెత్తందారీ నేతలకు దళితులంటే చులకన అని ఫైర్ అయ్యారు. మన ప్రభుత్వంలో అంబేద్కర్ స్ఫూర్తితోనే అందరినీ ఒక్కతాటిపై నిలబెడుతున్నామని తెలిపారు. ఇక నుంచి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తొస్తుందని పేర్కొన్నారు. సామాజిక చైతన్యాల వాడగా బెజవాడ విరాజిల్లుతుందంటూ సీఎం జగన్ చేసిన ప్రసంగంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అక్కడికి వచ్చిన ఆహుతులందరూ కూడా జగన్ ప్రసంగంతో ఉర్రూతలూగారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout