Pragati Bhavan:ప్రగతి భవన్ కంచెలు బద్దలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత..
- IndiaGlitz, [Thursday,December 07 2023]
ప్రగతి భవన్ గేట్లు బద్దలయ్యాయి. అక్కడ ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు పూర్తి ఎత్తివేశారు. ప్రగతి భవన్ ముందున్న రోడ్డుపై ఉన్న బ్యారికేడ్లు, గ్రిల్స్‌ని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. బ్యారికేడ్స్ లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు కూడా అనుమతించారు. దీంతో పదేళ్లుగా ఉన్న ట్రాఫిక్ ఆంక్షలకు తెరపడింది. కాగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజే ప్రగతి భవన్ పేరును డా. బీఆర్ అంబేద్కర్ ప్రజా భవన్‌గా మారుస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్, సచివాలయం తలుపులు సామాన్యులకు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే అడుగులు పడ్డాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేస్తూ బ్యారికేడ్లను పోలీసులు తొలగించారు.
కాగా 2014లో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి ఆయన అధికార నివాసం ప్రగతి భవన్ దగ్గర కంచెలు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. కేసీఆర్ అధికార దర్పానికి కేంద్రబిందువుగా ప్రగతి భవన్ కొనసాగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం లోపలకు వెళ్లేందుకు కష్టంగా ఉండేది. ఇక సామాన్యులు అయితే ట్రాఫిక్ ఆంక్షలతో అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రతిపక్షాలు ఆ కంచెలు తొలగించాలని తీవ్ర విమర్శలు చేశారు. మొత్తానికి దాదాపు 10 సంవత్సరాల తర్వాత ప్రగతి భవన్ కంచెలు బద్ధలయ్యాయి. ఇక రేపటి నుంచి సామాన్యులు స్వేచ్ఛగా ఆ దారిలో రాకపోకలు చేయవచ్చు.