Krishnam Raju: కృష్ణంరాజు సంస్మరణ సభలో లక్ష మందికి విందు... మెనూలో 30 రకాల వెజ్, నాన్ వెజ్ ఐటెమ్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల కన్నుమూసిన దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ గురువారం ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రభాస్‌ను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో అభిమానులు తరలివచ్చారు. వారందరికీ అభివాదం చేసిన ఆయన.. అందరినీ పలకరించి, భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరారు. సాధారణంగా కృష్ణంరాజు అభిమానులు, సన్నిహితులు ఇంటికొస్తే భోజనం పెట్టకుండా పంపించేవారు కాదు. ఈ విషయాన్ని చిత్ర పరిశ్రమలో ఎంతోమంది చెబుతూ వుంటారు. ఇప్పుడు ఆయన సంస్మరణ సభ సందర్భంగా కళ్లు చెదిరే స్థాయిలో భోజన ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు. దాదాపు లక్షమందికి వెజ్, నాన్ వెజ్ వంటకాలను వండించారు. మెనూలో దాదాపు 30 రకాల వెరైటీలు వున్నాయి.
9 టన్నుల మటన్, 6 టన్నుల చికెన్, 6 టన్నుల ఫ్రాన్స్ :
విందు భోజనం కోసం కనీవీని ఎరుగని రేంజ్‌లో ఏర్పాట్లు చేశారు రెబల్‌స్టార్ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు. దాదాపు 9 టన్నుల మటన్, ఆరు టన్నుల చికెన్, ఆరు టన్నుల ఫ్రాన్స్, నాలుగు టన్నుల చేపలతో రకరకాల వంటకాలను వండించారు. వీటిలో రాజుల బిర్యానీగా పేరొందిన దూకుడు గొర్రె దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫ్రై, మటన్ లివర్, చికెన్ లివర్, చేపల పులుసు, చేపల వేపుడు, పీతల ఇగురు, మెత్తళ్లు, రామాలు, రొయ్యల బిర్యానీ, రొయ్యల ఇగురు, గొంగూర రొయ్య, తలకాయ చారు ఇలా పలు రకాల వంటకాలను వండివార్చారు. వీటితో పాటు శాఖాహారుల కోసం ఎన్నో స్వీట్లు, సాంబారు, రసం, పెరుగు చట్నీ, మిఠాయి, పూర్ణం, రోటీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, పప్పు తయారు చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు 12 ఏళ్ల తర్వాత తన స్వగ్రామానికి చేరుకున్నారు. 2010లో ఆయన తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు కన్నుమూసిన సమయంలో ఆయన ఇక్కడికి వచ్చి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో బిజీగా వుండటంతో ప్రభాస్ మొగల్తూరుకు రావడం వీలుపడలేదు. ఈ నేపథ్యంలో దాదాపు పుష్కరకాలం తర్వాత తమ అభిమాన నటుడు వస్తున్నాడని తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు.. వూరంతా పోస్టర్లు, బ్యానర్లతో నింపేశారు. గురువారం బైక్ ర్యాలీలు, రెబల్ స్టార్, డార్లింగ్ నినాదాలతో మొగల్తూరు మారుమోగిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments