Pawan Kalyan:తమిళ చిత్రసీమ తమిళులకే అంటే ఎలా .. పద్ధతి మార్చుకోండి, మీరూ 'RRR' తీయాలి : పవన్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్-సాయిథరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ‘‘బ్రో’’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మన పరిశ్రమలో మన వాళ్లే చేయాలనే భావన కరెక్ట్ కాదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడుతోందని.. అందరినీ దగ్గరకి తీసుకుంటుందని ఆయన గుర్తుచేశారు. అలాగే తమిళ చిత్ర పరిశ్రమ కూడా అందరినీ తీసుకోవాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. తమిళ పరిశ్రమ తమిళులకే అంటే పరిశ్రమ ఎదగదని.. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుతుందంటే అన్ని భాషల వారిని అక్కున చేర్చుకోవడం వల్లనేనని పవర్ స్టార్ చెప్పారు.
మన భాష, మన ప్రాంతం అనుకుంటే కుచించుకుపోతాం :
కేరళ నుంచి వచ్చిన సుజిత్ వాసుదేవన్, ఉత్తరాదికి చెందిన ఉర్వశి రౌతేలా, దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన నీతా లుల్లా ఇలా అంతా ఇప్పుడు రాణిస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. అన్ని భాషల వాళ్లు, అందరూ వుంటేనే సినిమా అవుతుందని.. అంతే తప్పించి మన భాష, మనవాళ్లే వుండాలని అనుకుంటే కుచించుకుపోతామని పవన్ చెప్పారు. తమిళ సినిమాల షూటింగ్లలో తమిళ వాళ్లే వుండాలని, తమిళనాడులోనే షూటింగ్‌లు చేయాలంటూ కొందరు అంటున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి భావాల నుంచి బయటకు వచ్చి.. మీరు కూడా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు తీయాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
ఏఎం రత్నం తెలుగువారైనా తమిళనాడులో రాణించారు :
రోజా, జెంటిల్మెన్ వంటి సినిమాలు రావడానికి కారణం ఏఎం రత్నం అని ప్రశంసించారు. ఆయన తెలుగు వారైనా తమిళంలో మంచి సినిమాలు తీశారని.. మనం పరిధి పెంచుకుంటూ వెళ్దామని ఆయన అన్నారు. పరిధులు దాటారు కాబట్టే ఏఎం రత్నం మంచి సినిమాలు తీశారని.. తమిళ పరిశ్రమ విస్తృతి పెరగడానికి కారణం ఏఎం రత్నం అని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. స్థానికంగా కార్మికులకు సమస్యలుంటే ఖచ్చితంగా ఫీడింగ్ వుండాలని.. దానిని పరిష్కరించేందుకు మరోలా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక కళాకారుడికి కులం, మతం, ప్రాంతం అంటే పరిశ్రమ ఎదగదని .. దానిని దాటి ఆలోచించాలని పవన్ కల్యాణ్ తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలను కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout