Pawan Kalyan:ఇది నేను కోరుకున్న జీవితం కాదు : 'బ్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
తాను సినిమాల్లోకి కోరుకుంటే రాలేదని.. భగవంతుడు ఇచ్చిన జీవితమన్నారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్-సాయిథరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ‘‘బ్రో’’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు నుంచి తనకు బ్రహ్మానందంతో పరిచయం వుందన్నారు. ఒక నటుడిని కావాలని, రాజకీయాల్లోకి వస్తానని కూడా ఊహించలేదని పవన్ తెలిపారు.
నేను ఒక్కసారి నమ్మితే ఇక అంతే :
సమాజం నుంచి తీసుకోవడం కాదు.. సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని తాను నమ్ముతానని ఆయన పేర్కొన్నారు. సినిమాల్లోనూ సందేశం వుండేలా చూసుకుంటానని పవన్ కల్యాణ్ చెప్పారు. బ్రో సినిమాను ప్రత్యేకమైన సమయంలో వచ్చిందని.. కోవిడ్ సమయంలో , రాజకీయాల్లో తిరగలేని పరిస్థితుల్లో వున్నప్పుడు త్రివిక్రమ్ తనకు ఫోన్ చేసి బ్రో కథ గురించి చెప్పారని ఆయన పేర్కొన్నారు. త్రివిక్రమ్‌ను తాను పూర్తిగా నమ్మేస్తానని.. మానిటర్లో సైతం చూసుకోనని పవన్ చెప్పారు. సముద్రఖని రాసిన మూలకథకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సరికొత్త స్క్రీన్ ప్లే అందించారని ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ అనే హీరోను ఎలా ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో దృష్టిలో పెట్టుకుని స్క్రీన్ ప్లేను రూపొందించారని పవన్ చెప్పారు. సముద్రఖనితో పనిచేస్తూ తాను ఆయనకు అభిమానిని అయిపోయానని తెలిపారు.
సముద్రఖనితో నాతో సినిమా కోసం తెలుగు నేర్చుకున్నారు :
తెలుగు భాష చాలామందికి పలకడం రాదని, చదవడం రాదని .. తాను కూడా అప్పుడప్పుడు సరిదిద్దుకుంటూ వుంటానని పవన్ చెప్పారు. అటు పూర్తిగా తెలుగు రాక, ఇటు ఇంగ్లీష్ రాక .. పట్టుపని పది వాక్యాలు కూడా తెలుగులో మాట్లాడలేమన్నారు. మన భాష కాదు, మన యాస కాదు, మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు.. అయినా తెలుగు స్క్రిప్ట్‌ను సముద్రఖని గడగడ చదివేశారని ప్రశంసించారు. తనతో సినిమా చేస్తున్నానని చెప్పి తెలుగు చదవడం నేర్చుకున్నానని సముద్రఖని చెప్పారని పవన్ తెలిపారు.
త్వరలో తమిళ్లో స్పీచ్ ఇస్తా :
తనకు తమిళ్ మాట్లాడటం వచ్చునని, అయితే ఆయన కోసం తమిళనాడు వచ్చి స్పీచ్ ఇస్తానని పవన్ మాట ఇచ్చారు. మేం మా మాతృభాషను ఎంత నేర్చుకోవాలని సముద్రఖని చూపించారని ఆయన పేర్కొన్నారు. తెలుగు మాతృభాష అయ్యుండి .. ఎంతోమందికి చదవడం, పలకం రాదని సముద్రఖని చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారని పవన్ వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్యం విలువ తెలుసుకుంటే గొప్ప గొప్ప సినిమాలు తీయొచ్చునని ఆయన పేర్కొన్నారు. తమిళ సాహిత్యాన్ని నేర్చుకోవడం వల్ల సముద్రఖని మంచి సినిమాలు తీయగలుగుతున్నారని పవన్ ప్రశంసించారు.
ఎన్టీఆర్‌లా నేను డ్యాన్స్‌లు చేయలేను :
సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని.. కానీ సమాజం బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లా డ్యాన్సులు చేయకపోవచ్చు .. ప్రభాస్, రానాల మాదిరిగా ఏళ్ల తరబడి కష్టపడకపోవచ్చు కానీ.. సినిమా అంటే తనకు ఎంతో ప్రేమ అన్నారు. చిత్ర పరిశ్రమ ఒక్క మెగా ఫ్యామిలీది కాదని.. అందరిదీ అని పవన్ వ్యాఖ్యానించారు. చిరంజీవి కూడా దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారని , తమకు ఎవరు గాడ్ ఫాదర్ లేరని పవర్ స్టార్ చెప్పారు. చిరంజీవి మెగాస్టార్ అయ్యాక.. తనను హీరో అవుతావా అని అడిగారని.. దీనికి తనకు భయం వేసిందని, ఎందుకంటే తన ఊహాల్లో హీరో అంటే చిరంజీవే అన్నారు. కృష్ణ కూడా ఇష్టమేనని , ఎన్టీఆర్ , ఏఎన్నార్ పెద్ద నటులు అని చెప్పారు. చిన్న ఉద్యోగం చేసి పొలంలో పని చేసుకోవాలని అనుకున్నానని పవన్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout