Pawan Kalyan: నాటు నాటుకు గోల్డెన్ గ్లోబ్.. ఆర్ఆర్ఆర్ యూనిట్‌కి పవన్ అభినందనలు, ఆస్కార్ కూడా కొట్టాలన్న పవర్‌స్టార్
- IndiaGlitz, [Wednesday,January 11 2023]
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ కీరవాణి, రాజమౌళిలపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేరారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
భారతీయులందరికీ గర్వకారణం:
ఆర్.ఆర్.ఆర్.చిత్రంలోని ‘నాటు నాటు...’గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం భారతీయులందరూ ఎంతో సంతోషించదగ్గ పరిణామంగా పవన్ అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్న ఈ గీతానికి స్వరకల్పన చేసిన ఎం.ఎం.కీరవాణికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. తెలుగు గీతానికి ఉన్న కీరిప్రతిష్టలను గోల్డెన్ గ్లోబ్ పురస్కారం మరింత ఇనుమడింపచేస్తుందన్న ఆయన.. ‘నాటు నాటు’ గీతాన్ని రచించిన చంద్రబోస్, ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు పవన్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారం కోసం పోటీపడుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఆ వేదికపైనా పురస్కారాలు పొందాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి ప్రశంసలు పొందేలా రూపుదిద్దిన రాజమౌళి, హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్, నిర్మాత డి.వి.వి.దానయ్యలకు ఆయన అభినందనలు తెలియజేశారు.
1200 వందల కోట్ల వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్:
ఇదిలావుండగా.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో విశేషాలు బోలెడు. తెలుగు సినిమాను శాసించే రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసులు కలిసి నటిస్తే చూడాలని కలలు కన్న వారికి దానిని నిజం చేసి చూపారు జక్కన్న. ఎన్టీఆర్ - రామ్‌చరణ్ హీరోలుగా నటించగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవ్‌గణ్, అలియా భట్‌లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో దీనికి మరింత హైప్ వచ్చింది. శ్రీయా శరణ్, సముద్రఖని తదితరులు కీలకపాత్ర పోషించారు. మార్చి 24న రిలీజైన ఈ సినిమా సౌత్ , నార్త్ , ఓవర్సీస్ రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్ల కలెక్షన్స్ సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.
ఆర్.ఆర్.ఆర్. చిత్ర గీతానికి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం సంతోషదాయకం - JanaSena Chief Sri @PawanKalyan@RRRMovie @ssrajamouli @mmkeeravaani@boselyricist @Rahulsipligunj @kaalabhairava7 @AlwaysRamCharan @tarak9999 @DVVMovies#GoldenGlobes2023#NaatuNaatu#RRRMovie pic.twitter.com/5MpxvziiL8
— JanaSena Party (@JanaSenaParty) January 11, 2023