Pawan Kalyan:సన్నని వాగు మహానదిగా మారినట్లు : హ్యాపీ బర్త్ డే అన్నయ్య ..అంటూ పవన్ ఎమోషనల్

  • IndiaGlitz, [Tuesday,August 22 2023]

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజుగా ఏలారు. ఒకానొక దశలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ను మించిన స్థార్‌గా, ఆయన కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడిగా చిరంజీవి సంచలనం సృష్టించారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వం, మంచితనం, మానవత్వం మెగాస్టార్ సొంతం. అందుకే ఆయనను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది హీరోలు, టెక్నీషియన్లు వెండితెరపైకి వచ్చారు.. వస్తున్నారు.

చిరుకు మెగాభిమానుల గ్రీటింగ్స్ :

రేపు చిరంజీవి తన 68వ పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచం నలుమూలలా వున్న తెలుగువారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడా ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన సోదరుడు, సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చిరంజీవికి పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

కించిత్ గర్వం లేదు :

“అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya ..!” అంటూ పవన్ తన సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.