Pawan Kalyan:మా వదిన నాకు ద్రోహం చేసింది .. ఆవిడ వల్లే ఇలా : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
తాను హీరో అవ్వడానికే మా వదినే కారణమన్నారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ . సముద్రఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్-సాయిథరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ‘‘బ్రో’’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సుస్వాగతం సినిమా కోసం తనతో విశాఖ జగదాంబ సెంటర్‌లో డబుల్ డెక్కర్ బస్‌పై డ్యాన్స్ చేయించారని తెలిపారు. అప్పుడు తనకు ఏడుపు వచ్చేసిందని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. పది మంది ముందు నటించాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా తనకు సిగ్గు అని తెలిపారు. దీంతో తాను వదినకు ఫోన్ చేసి తనను ఎందుకు సినిమాల్లోకి తోసావంటూ ప్రశ్నించానని పవన్ చెప్పారు. ఆ రోజు మా వదిన చేసిన తప్పు ఈ రోజు మీ ముందు నిలబెట్టిందని పవర్‌స్టార్ నవ్వుతూ చెప్పారు.
కష్టపడితేనే మేమంతా హీరోలుగా నిలబడ్డాం :
మా వదిన ద్రోహం చేయకుంటే తన పాటికి తాను చిన్న జీవితం గడిపేవాడిని పవన్ పేర్కొన్నారు. చిరంజీవి తమ్ముడినే అయినా తనకు వూరకే వద్దని కష్టపడాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. సన్నగా , చిన్నగా కనిపిస్తానేమో కానీ చాలా మొరటు మనిషినని పవన్ తెలిపారు. ఒక కుటుంబం నుంచే ఇంత మంది హీరోలా అని అందరూ అనుకుంటున్నారని.. కానీ తాము గొడ్డు చాకిరీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దెబ్బలు తగులుతాయని, కడుపులు మాడ్చుకుంటామని, నష్టాలొచ్చినా ఆనందంగా తీసుకుంటామని పవన్ తెలిపారు. దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన తామే సాధించినప్పుడు మీరు ఎందుకు సాధించలేరని ఆయన ప్రశ్నించారు.
మహేశ్- రాజమౌళి సినిమాకు ఆల్ ది బెస్ట్ :
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కలిసినప్పుడల్లా సాహిత్యం, సైన్స్ గురించే మాట్లాడుకుంటామని పవన్ తెలిపారు. ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చదివి గోల్డ్ మెడల్ సాధించిన త్రివిక్రమ్.. సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీకి వచ్చి దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. త్రివిక్రమ్‌కు హిందీ, సంస్కృతంలో మంచి పట్టుందని చెప్పారు. పవన్‌ను తాను గురుస్థానంలోనే వుంచుతానని , ఆయనను స్పూర్తిగా తీసుకుని మరింత మంది యువ రచయితలు పరిశ్రమకు రావాలని కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమను రాజమౌళి హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారని.. రేపటి తరం దీనిని ఇలాగే కొనసాగించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. మహేశ్‌తో త్వరలో రాజమౌళి తెరకెక్కించనున్న సినిమా అద్భుతంగా రావాలని ఆకాంక్షించారు.
ఒక హీరో సినిమా చేయడం వల్ల వందల మందికి ఉపాధి :
ఒక హీరో సినిమా తీయడం వల్ల సరాసరి 200 మందికి తిండి దొరుకుతుందని .. హీరోలందరూ తనకు ఎంతో ఇష్టమని పవన్ చెప్పారు. కానీ సినిమా చేసేటప్పుడు మాత్రం తాను అందరికంటే పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటానని ఆయన పేర్కొన్నారు. పోటీతత్వం లేకపోతే మనం వెనుకబడి పోతామని.. ఆర్ఆర్ఆర్, బాహుబలి వంటి సినిమాల రికార్డుల్ని మనం కూడా కొట్టాలని అనిపిస్తుందన్నారు. సుజిత్ వాసుదేవన్, సముద్రఖనిలు ఎంతో ప్లానింగ్‌తో సినిమాను చాలా వేగంగా పూర్తి చేశారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout