Turkey : టర్కీ, సిరియాలను వణికించిన భారీ భూకంపం.. ఇప్పటి వరకు 560 మంది, కోట్లలో ఆస్తినష్టం
Send us your feedback to audioarticles@vaarta.com
సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపానికి టర్కీ, సిరియా దేశాలు చివురుటాకుల వణికిపోయాయి. భూకంప ధాటికి వేలాది ఇళ్లు నేలమట్టమవ్వగా.. ఇప్పటి వరకు 560 మందికిపైగా మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. లెక్కకు మిక్కిలిగా క్షతగాత్రులయ్యారు. టర్కీ కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది.
గాఢ నిద్రలోనే గాల్లో కలిసిన ప్రాణాలు:
తెల్లవారుజామున అంతా గాఢనిద్రలో వున్న వేళ భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఆగ్నేయ టర్కీలోని గాజియాన్‌తెప్‌కు 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం వున్నట్లు గుర్తించారు. దీని ధాటికి దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. టర్కీలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లోని వందలాది భవనాలు కుప్పకూలాయి. టర్కీలో 284 మంది మరణించగా, 2300 మంది తీవ్రంగా గాయిపడినట్లు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇక సిరియా విషయానికి వస్తే ప్రభుత్వ ఆధీనంలోని 237 మంది మరణించగా, 639 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెబల్స్ అధీనంలో వున్న ప్రాంతాల్లో 47 మంది మరణించారు. ఇరు దేశాల్లోనూ శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుని వుండటంతో.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది.
మోడీ దిగ్భ్రాంతి:
మరోవైపు భూకంపం నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. టర్కీ, సిరియాలకు అండగా వుంటామని ఆయా దేశాలు ప్రకటించాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ .జైశంకర్ సైతం భూకంపం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని.. ఆయా దేశాలకు అండగా వుంటామని ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout