Download App

Power Star Review

క‌రోనా వైర‌స్‌.. లాక్‌డౌన్ టైమ్‌.. సినిమా థియేట‌ర్స్ మూత‌.. షూటింగ్స్ ఆపివేత‌.. ఇవి ఐదు నెల‌లుగా తెలుగు సినిమానే కాదు.. ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి. దీని వ‌ల్ల ఓటీటీల‌కు, ఏటీటీలు, యాప్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. క‌రోనా వైర‌స్ టైమ్‌లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. త‌న ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో ‘క్లైమాక్స్‌, క‌రోనా వైర‌స్‌, నెక్డ్’ సినిమాల‌ను రూపొందించి విడుద‌ల చేశారు ఆర్జీవీ. ఎప్పుడూ వివాదాల‌తో సావాసం చేసే వ‌ర్మ .. ఓ అడుగు ముందుకేసి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను టార్గెట్ చేసి ‘ప‌వ‌ర్ స్టార్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ముందు ప‌వ‌న్ అభిమానులు పెద్ద‌గా దీని గురించి ప‌ట్టించుకోలేదు కానీ.. క్ర‌మంగా వ‌ర్మ అంద‌రి అటెన్ష‌న్‌ను త‌న సినిమాపై పెంచేలా చేసిన ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ అయ్యాయి. కొంద‌రు ప‌వ‌న్ అభిమానులు ఈసారి ఏకంగా వ‌ర్మ‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయ‌డానికి సిద్దం కావ‌డం విశేషం. మ‌రి. ఇంతకూ వ‌ర్మ ‘ప‌వ‌ర్‌స్టార్‌’ సినిమాలో ఏం చెప్పారనే విషయంలోకి వెళదాం...

కథ:

ఆర్జీవీ సినిమాలో క‌థ‌ను వెతుక్కునేంత అవ‌స‌రం ఎప్పుడో పోయింది. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నార‌నే దానిపై ‘ప‌వ‌ర్‌స్టార్’ సినిమాను తెర‌కెక్కించారు వ‌ర్మ‌. అయితే ఎక్క‌డా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరుని నేరుగా ప్ర‌స్తావించ‌లేదు. ప్ర‌వ‌న్ క‌ల్యాణ్ అని సంబోధించారు. ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌వ‌న్ ఎవరెవ‌రిని క‌లిశారు?  ఎలా ఆత్మ ప‌రిశీల‌న చేసుకున్నారు?  చివ‌ర‌కు ప్ర‌వ‌న్‌కు దొరికిన స‌మాధానం ఏంటి? అనేదే సినిమా.

విశ్లేష‌ణ‌:

రామ్‌గోపాల్ వ‌ర్మ న‌టీన‌టుల‌కు సంబంధించిన సినిమాల‌ను తెర‌కెక్కించేట‌ప్పుడు అలాగే ఉండే న‌టులను ఎంపిక చేసుకుని తెర‌పై చూపించ‌డ‌మే. అలా ‘ప‌వ‌ర్‌స్టార్‌’ సినిమాలో పవన్‌క‌ల్యాణ్‌ను పోలిన వ్య‌క్తిని తెర‌పై చూపించ‌డ‌మే ముందు ప్ల‌స్‌గా మారింది. క్ర‌మంగా సినిమాపై అంద‌రినీ అటెన్ష‌న్ తెప్పించుకోవ‌డంలో వ‌ర్మ స‌క్సెస్ అయ్యారు. వ‌ర్మ త‌మ అభిమాన హీరో టార్గెట్ చేయ‌డంపై ప‌వ‌న్ అభిమానులు సోష‌ల్ మీడియాలోనే కాదు.. బ‌హిరంగగానూ భ‌గ్గుమ‌న్నారు. కొంద‌రైతే అస‌లు ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌న్ మాన‌సిక స్థితి వ‌ర్మ చూపించిన తీరుగానే ఉందా? అయితే సినిమాలో ఏం చూపించ‌బోతున్నారోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూశారు కూడా.  సినిమాను ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చిన రోజు త‌ర్వాత రాత్రి ప్ర‌వ‌న్ త‌న పార్టీకి ఒక సీటే రావ‌డానికి కార‌ణ‌మేంటి?  రెండు స్థానాల్లోనూ తను గెల‌వ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంట‌ని బాధ‌ప‌డుతుంటారు. ఆ స‌న్నివేశాల‌ను నార్మ‌ల్‌గానే చూపించారు. ఇక సినిమాలో ప్ర‌వ‌న్ పాత్ర‌తో పాటు మరో నాలుగు పాత్ర‌లు క‌నిపిస్తాయి. ఒక‌టి బండ్ల‌గ‌ణేశ్‌ను పోలిన పాత్ర‌.. మ‌రో పాత్ర త్రివిక్ర‌మ్‌ను పోలిన పాత్ర‌.. నారా చంద్ర‌బాబు నాయుడుని పోలిన పాత్ర‌.. పవ‌న్ మూడో భార్య పాత్ర‌.. ఇందులో త్రివిక్ర‌మ్‌ను పోలిన పాత్ర‌ను ప‌వ‌న్ కొట్టిన‌ట్లు, తిట్టిన‌ట్లు వ‌ర్మ చూపించారు. అలాగే బండ్ల‌గ‌ణేశ్ పాత్ర‌ను గుండ్ల ర‌మేశ్ అని చూపించారు. ఈ పాత్ర‌ను త‌న ఫామ్ హౌస్‌లో త‌రిమికొట్టేటట్లు చూపించారు. ఇక త‌న ర‌ష్య‌న్ భార్య‌తో ఎలా ఉంటాడ‌నే కొన్ని స‌న్నివేశాల‌ను చూపించారు. ఇక అన్న‌య్య మెగాస్టార్‌ను పోలిన పాత్ర‌ను చూపించారు. చిరంజీవిని పోలిన పాత్ర విమ‌ర్శించ‌డం.. తాను రాజ‌కీయాల‌కు ఎందుకు దూర‌మ‌య్యానో అని చెప్ప‌డం సినిమాలో క‌నిపిస్తాయి. ఇక చివ‌ర‌లో త‌న‌కు ఎవ‌రు స‌ల‌హా ఇస్తారోన‌ని ప్ర‌వ‌న్ పాత్ర మ‌థ‌న‌ప‌డుతున్న‌ప్పుడు ఆర్జీవీ పాత్ర‌ను ఎంట్రీ ఇప్పించ‌డం కాస్త షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆర్జీవీ.. గాజు తేజ‌(రాజా ర‌వితేజ‌) కార‌ణంగా ఎన్నిక‌ల్లో ఓడిపోయావ‌ని చెప్ప‌డం.. నేను నీకు చాలా పెద్ద అభిమానిన‌ని, సెక్స్ కంటే నిన్నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తాన‌ని, పార్టీ పెట్టిన‌ప్పుడు అంద‌రి కంటే.. ఎక్కువ‌గా నేను ఇష్ట‌ప‌డ్డాన‌ని ఆర్జీవీ తెలిపారు. ప‌వ‌న్‌లో ఇన్టెన్సిటీ బాగా న‌చ్చిందని ఆయ‌న తెలిపారు. నిజాయ‌తీ గ‌ల రాజ‌కీయాలు చేస్తే 2024 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ విజ‌యం ఖాయ‌మ‌ని, త‌నే సీఎం అవుతాడ‌ని, అలా ప‌వ‌న్ సీఎం అయిన‌ప్పుడు ఆయ‌న ఫ్యాన్స్ కంటే ముందే నేను జై ప‌వ‌ర్‌స్టార్ అంటాన‌ని తెలిపారు. ‘ప‌వ‌ర్‌స్టార్‌’ను సినిమా అన‌డం కంటే.. షార్ట్ ఫిలిం అంటేనే బెట‌ర్‌.. ఎందుకంటే ‘ప‌వ‌ర్‌స్టార్‌’ వ్య‌వ‌థి 37 నిమిషాలు మాత్ర‌మే ఉండ‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే ప‌వ‌న్ గురించి చెడుగా చూపించ‌లేదు కానీ.. త్రివిక్ర‌మ్‌, బండ్ల‌గ‌ణేశ్‌ల‌ను ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేశాడు ఆర్జీవీ.

బోట‌మ్ లైన్‌:  ప‌వ‌న్‌కు మార్గదర్శకం అవసరం అని చెప్పిన ఆర్జీవీ షార్ట్ ఫిలిం ‘పవర్‌స్టార్’

Read Powerstar Review in English

Rating : 1.0 / 5.0