భీమ్లా నాయక్ : వికారాబాద్‌లో కొత్త షెడ్యూల్.. పవన్‌ను చూసేందుకు ఎగబడ్డ జనం

  • IndiaGlitz, [Friday,December 17 2021]

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ శుక్రవారం ఉదయం వికారాబాద్‌లోని మదన్‌పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రారంభమైంది. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనుంది యూనిట్. దీంతో పవన్‌ కల్యాణ్‌ షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు. ఆయన రాకవిషయం తెలుసుకున్న స్థానికులు, పవర్‌స్టార్ అభిమానులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ‘‘పవర్‌స్టార్.. పవర్‌స్టార్ ’’ అంటూ నినాదాలు చేశారు. అభిమానుల తాకిడితో పవన్ కారులోంచి దిగడం కూడా కష్టమైంది. పోలీసులు, భద్రతా సిబ్బంది అతి కష్టం మీద ఆయనను సెట్ వద్దకు చేర్చారు. కారు నుంచి బయటకు వచ్చిన పవన కల్యాణ్ అభిమానులకు, ప్రజలకు నమస్కరిస్తూ వెళ్లారు.

ఇకపోతే ’వకీల్ సాబ్’ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో ‘‘భీమ్లా నాయక్‌’’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ భీమ్లా నాయక్ పాట 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. లాలా.. బీమ్లా.. అంటూ సాగే సాంగ్‌ను స్వయంగా తివిక్రమ్ రాశారు. భీమ్లా నాయక్ ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ఆదిత్య మ్యూజిక్ ఆ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ .. దీనికి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌, రానాకు జంటగా సంయుక్త మేనన్‌ సందడి చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.