ఫ్యాన్స్‌కి హ్యాండిచ్చిన భీమ్లా నాయక్... సంక్రాంతి బరి నుంచి ఔట్..?

  • IndiaGlitz, [Tuesday,December 21 2021]

వకీల్ సాబ్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘‘భీమ్లా నాయక్’’.. ఆయనతో పాటు యువ హీరో రానా కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ .. దీనికి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్‌, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీని కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ‘‘భీమ్లా నాయక్’’ పోస్ట్ పోన్ అవుతుంద‌నే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ప్రమోషన్ విషయంగా ఎలాంటి చప్పుడు లేకపోవడం, కనీసం ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయకపోవడం వంటి అంశాలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. అలాగే సినిమా వాయిదా పడటానికి కూడా అనేక కార‌ణాలున్నాయి.

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు నాగార్జున నటించిన ‘‘బంగార్రాజు’’ కూడా సంక్రాంతికే ఫిక్స్ అయ్యింది. అయినప్పటికీ భీమ్లా నాయ‌క్‌ను అనుకున్న తేదీకే విడుదల చేయాలని నిర్మాత‌లు చివరి వరకు భావించారు. కానీ డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ నుంచి నిరాక‌ర‌ణ సహా.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ నిర్మాతల రిక్వెస్ట్‌ను మన్నించి ‘‘భీమ్లా నాయ‌క్’’ వెన‌క‌డుగు వేయ‌క త‌ప్ప‌లేద‌నేది ఫిలింనగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. దీనికి పవన్‌కల్యాణ్ సైతం సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. దీనిపై రేపు లేదా ఎల్లుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది. సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే.. మహా శివరాత్రికి ‘‘భీమ్లా నాయక్’’ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ వుంది.