ముచ్చింతల్‌లో సమతామూర్తిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. ఆ అర్హత మోడీదేనంటూ వ్యాఖ్యలు
- IndiaGlitz, [Monday,February 07 2022]
హైదరాబాద్ ముచ్చింతల్ చినజీయర్ ఆశ్రమంలో సమతామూర్తి రామానుజుల వారి 216 అడుగుల విగ్రహాన్ని దర్శించుకున్నారు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమతా కేంద్రం వద్దకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంత ఎత్తులో సమతామూర్తి విగ్రహం స్థాపించడం చినజీయర్ స్వామి మహాసంకల్పం వల్లే సాధ్యమైందని పవన్ ప్రశంసించారు. 108 దివ్య ఆలయాలు ఒకే చోట ఉండటం గొప్ప విషయమని... ఈ దివ్యక్షేత్రం భాగ్యనగరానికి సరికొత్త గుర్తుగా మారిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన రామానుజ విగ్రహాన్ని నరేంద్ర మోడీ ఆవిష్కరించడం శుభపరిణామమన్నారు పవన్ . రాజకీయాలు పక్కన పెడితే ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే అర్హత నరేంద్ర మోడీకే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం పవన్‌కల్యాణ్‌ను చినజీయర్ స్వామి ఆశీర్వించి.. సత్యరించారు. ముచ్చింతల్‌కు పవన్ వస్తున్నట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఇకపోతే.. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 7న ఏపీ సీఎం వైఎస్ జగన్ వేడుకల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 8న కేంద్ర హోంమంత్రి అమిత్ , ఫిబ్రవరి 9న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ .. ఫిబ్రవరి 10న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ .. ఫిబ్రవరి 11న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఫిబ్రవరి 12న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమతా స్ఫూర్తి కేంద్రానికి విచ్చేయనున్నారు.