Pawan Kalyan : రెండు దశాబ్ధాల తర్వాత పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. ఎవరి తుక్కు రేగ్గొట్టడానికో

  • IndiaGlitz, [Saturday,December 10 2022]

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ కేవలం సినీ హీరో మాత్రమే కాదు. ఆయనలో బహుముఖ ప్రజ్ఞ దాగున్న సంగతి తెలిసిందే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా, రాజకీయవేత్తగా రాణిస్తున్నారు. ఇక అంతకంటే ముందే పవన్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశముందన్న సంగతి అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలోని కొన్ని సినిమాల్లో పవన్ వాటిని ప్రదర్శించారు కూడా. ముఖ్యంగా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయ్, తమ్ముడు, బద్రీ, ఖుషీ, జల్సా లాంటి సినిమాల్లో పవన్ స్టంట్స్‌కి కుర్రకారు వెర్రెక్కిపోయారు. ఆయన బాటలోనే పలువురు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు.

క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు :

పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తోన్న చిత్రం హరిహర వీరమల్లు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన వీరమల్లు పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్ అవసరమైనందున.. దీని కోసం విపరీతంగా సాధన చేస్తున్నారు పవర్‌స్టార్. లాంగ్ హెయిర్‌ స్టైల్‌తో తన ట్రైనర్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే.

రెండు దశాబ్ధాల తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ :

తాజాగా ఈరోజు పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌లోకి వచ్చానంటూ ఆయన ఈ పోస్ట్‌లో రాశారు. అయితే ఈ ప్రాక్టీస్ దేనికోసమనేది మాత్రం పవన్ కల్యాణ్ చెప్పలేదు. అయితే ఈ ఫోటోలు మాత్రం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

యుద్ధానికి వారాహి సిద్ధం:

ఇదిలావుండగా... పవన్ వచ్చే ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్రతో పాటు జనవాణి కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ఏడాది దసరా నాడు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించాలని పవన్ భావించినా అనివార్య కారణాలతో వాయిదా పడుతోంది. అయితే ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం వుండటంతో ఆయన జాగ్రత్త పడుతున్నారు. షూటింగ్‌ విరామ సమయాల్లో రాష్ట్రంలోని ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. చేతిలో వున్న సినిమాలను వేగంగా కంప్లీట్ చేసి పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ బస్సు యాత్ర నిర్వహించాలని పవన్ కల్యాణ్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించి తన అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా బస్సును తయారు చేయించారు. దీనికి ‘వారాహి’ అనే పేరు పెట్టారు.