వ్యక్తిత్వంలో ‘‘బంగారం’’.. పెద్ద మనసు చాటుకున్న పవన్, వీడియో వైరల్
- IndiaGlitz, [Sunday,April 24 2022]
పవన్ కళ్యాణ్... ఆ పేరు వింటే తెలుగు నాట అభిమానులు ఆనందంతో గంతులేస్తారు. ఆయ తెరపై కనిపిస్తే చాలు థియేటర్ దద్దరిల్లేపోతుంది. హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఆకాశాన్నంటే ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న అతి కొద్దిమంది నటుల్లో పవన్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడల్లో చిత్ర సీమలోకి అడుగుపెట్టినా.. తర్వాత తనదైన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇంతటి ప్రేమాభిమానాలు దక్కించుకోవడంలో ఆయన నటన కంటే.. పవన్ వ్యక్తిత్వానిదే ముఖ్య పాత్ర అంటారు ఆయనను దగ్గరి నుంచి చూసినవాళ్లు.
చెట్లు, ఇంకొన్ని పుస్తకాలు వుంటే చాలు పవన్ ప్రశాంతంగా బతికేస్తారని దర్శకుడు త్రివిక్రమ్ ఎన్నోసార్లు అన్నారు. అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్నా.. ఆయనెప్పుడూ సాధారణ జీవితం గడిపేందుకే ఇష్టపడతారు. తనను ఇంతటి వాడిని చేసిన దేశానికి ఏదైనా చేయాలని నిత్యం పరితపిస్తారు పవన్ . తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో మరేదైనా ప్రాంతాల్లో విపత్తులు వచ్చిన ప్రతీసారి ఆయనే ముందుగా విరాళాలు ఇచ్చిన సందర్భాలున్నాయి. సినీ పరిశ్రమలోనూ పవన్ కల్యాణ్ ఎంతోమందిని ఆదుకున్నారు.
ప్రస్తుతం జనసేన అధినేతగా రాజకీయాల్లో వున్నా ఆయన వ్యక్తిత్వం ఏమాత్రం మారలేదు. తాజాగా తన మంచి మనసును చాటుకున్నారు పవన్ కల్యాణ్. వివరాల్లోకి వెళితే.. ‘‘జనసేన కౌలు రైతు భరోసా యాత్ర’’ పేరిట ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి వచ్చారు. పవన్ రాక విషయం తెలుసుకున్న ప్రజలు, అభిమానులు చింతలపూడికి భారీగా చేరుకున్నారు.
దీంతో జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల తరం కాలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ పోలీసుల బందోబస్త్ మధ్య వెళ్తుండగా జనసందోహం ఎక్కువ కావడంతో ఒక పోలీస్ అధికారి అదుపుతప్పి కింద పడిపోయాడు. దీనిని గమనించిన పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి అంతమందిని దాటుకొని పోలీసును లేపి.. జాగ్రత్తలు చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక వైపు SI, CI, DSP స్థాయి వాళ్లను కూడా MLA లు, మంత్రులు అమ్మ నా బూతులు తిడుతూ, ప్రజాప్రతినిధుల బందు వర్గం అనుచరులు దాడులు చేస్తుంటే జనసేన అధినేత @PawanKalyan గారు కింద పడ్డ పోలీస్ కానిస్టేబుల్ సోదరుడికి చెయ్యి అందించి పైకి లేపారు అది ఆయన వ్యక్తిత్వం..! pic.twitter.com/dJLB4INev9
— Dr. Sandeep Panchakarla (@DrSandeepJSP) April 23, 2022