త్రివిక్రమ్ భార్య సౌజన్య నృత్య ప్రదర్శన.. చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
వెండితెరపై రాణిస్తున్న పలువురు నటీనటులు, టెక్నీషీయన్ల జీవిత భాగస్వాములు పలు రంగాల్లో నిష్ణాతులు. అయితే వారి భార్య/ భర్తలకు చేదోడువాదోడుగా వుండేందుకు గాను తమ ప్రతిభను దాచుకుంటూ వుంటారు. అయితే కొందరు తమ లైఫ్ పార్టనర్‌ల టాలెంట్‌ను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ వుంటారు. ఈ కోవకే వస్తారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. రచయిత, దర్శకుడిగా ఆయన ఎంత బిజీగా వుంటారో తెలిసిందే. దీంతో ఆయన భార్య సౌజన్య అన్ని వ్యవహారాలను చక్కబెడుతూ భర్తకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. అయితే స్వతహాగా ఆమె ఒక నృత్యకారిణీ. క్లాసికల్ డ్యాన్స్‌లో సౌజన్యకు ఎంతో పట్టుంది. గతంలో కూడా రవీంద్రభారతిలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కారణం చేతనేమో త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాల్లో హీరోయిన్లు క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సీన్లు పెట్టి ఉంటారేమో.
ఇకపోతే.. సౌజన్య శ్రీనివాస్ తాజాగా “మీనాక్షి కళ్యాణం” పేరుతో ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నారు. ఈరోజు హైదరాబాద్ శిల్పకళా వేదికపై ఆమె ఈ రూపకాన్ని ప్రదర్శిస్తారు. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలసి ఈ ఈవెంట్‌ను స్పాన్సర్ చేస్తున్నాయి. ఈ మేరకు పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సౌజన్య క్లాసికల్ డ్యాన్సర్ గా దైవిక భంగిమలో ఎంతో మనోహరంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వేడుక కోసం హైదరాబాద్‌లోని త్రివిక్రమ్ అభిమానులు, కళాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యణ్ ఈ రూపకాన్ని చూసేందుకు ముఖ్యఅతిథిగా రానుండగా, త్రివిక్రమ్ ఆత్మీయ అతిథి. వీరితో పాటు గౌరవ అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తనికెళ్ల భరణి, వసంత లక్ష్మీ, నరసింహాచారి, చుక్కపల్లి సురేష్, సతీష్ చంద్ర గుప్తా తదితరులు హాజరుకానున్నారు.
కాగా.. సౌజన్య శ్రీనివాస్ త్వరలో నిర్మాతగా కూడా మారుతున్నారు. త్రివిక్రమ్ ఇటీవల సొంతంగా నిర్మాణ సంస్థని స్థాపిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ తీసే కొత్త సినిమాలకు సౌజన్య శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments