పవన్ పేరులో కిక్కే వేరప్పా... అదో మాదిరి ఉప్పెన!

'కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు' - 'గబ్బర్ సింగ్'లో డైలాగ్. విలన్ ఇంటికి పవన్ కటౌట్‌తో బ్రహ్మానందం వెళ్లే సీన్‌కి థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. కంటెంట్ ఉన్నోడి కటౌట్ మాత్రమే కాదు... పేరు వినపడినా చాలు విజిల్స్ పడతాయి. గతంలో మెగా ఫ్యామిలీ హీరోస్ సినిమా ఫంక్షన్లలో పవర్ స్టార్ అభిమానులు హంగామా హంగామా చేశారు. ఒకరిద్దరు మెగా హీరోలు అభిమానుల ప్రవర్తనతో చికాకు చెందారు కూడా! అయినా పవర్ కల్యాణ్ క్రేజు తగ్గలేదు. 'ఉప్పెన' ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా మరోసారి బయటపడింది. ఓసారి ఆ మూమెంట్స్ ఏవో చూద్దామా?

'పవర్ స్టార్ గుండెల్లో ఉంటారు' - వైష్ణవ్ తేజ్ మాట్లాడుతుండగా అభిమానులు పవన్ గురించి గోల చేసిన వెంటనే ఏమాత్రం తడుముకోకుండా చెప్పిన మాట. దీనికి రెస్పాన్స్ అదిరింది. 

'పవర్ స్టార్ సినిమా గురించి అప్‌డేట్ అప్‌డేట్ అని అందరూ అడుగుతున్నారు. పవర్ స్టార్ సినిమా గురించి అప్‌డేట్ కాదు.... అప్ టు డేట్ అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. బట్, చెప్పాలిన సందర్భం ఇది కాదు' - హరీష్ శంకర్ అంత వివరంగా చెప్పారంటే... వేదిక ముందున్న అభిమానుల ఎంత గట్టిగా అడిగారో అర్థం చేసుకోవచ్చు.

పవన్ కల్యాణ్ తో చేయబోయే సినిమా అప్‌డేట్ గురించి చెప్పడానికి ముందు స్పీచ్ స్టార్టింగ్ లో పవర్ స్టార్ గురించి హరీష్ శంకర్ మాట్లాడారు. 'ఒకసారి పవన్ కల్యాణ్ గారి దగ్గర ఏదో సినిమా...' అని అన్నారో లేదో 30 సెకన్లు అరుపులు, ఈలలతో ఆడిటోరియంలో రీసౌండ్ వచ్చింది. ఆ తర్వాత పవన్ మంచి మనసు గురించి హరీష్ శంకర్ చెప్పారు. 

'పవన్ కల్యాణ్ గారితో ఎవరో నెక్స్ట్ త్రీ మంత్స్ అన్నీ మన ఫ్యామిలీ సినిమాలే రిలీజ్ అవుతున్నాయని అన్నారు. అప్పుడు కల్యాణ్ గారు 'మన ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ కాదు, సినిమా ఇండీస్ట్రీ మొత్తం మా ఫ్యామిలీ అన్నారు. నిజంగా ఈమాట చిరంజీవిగారు కూడా చాలాసార్లు అన్నారు' - హరీష్ శంకర్.

'వైషూ... నేను ఫస్ట్ నిన్ను చూసినప్పుడే అనుకున్నా. నువ్వు పవన్ కల్యాణ్ గారిలా పెద్ద స్టార్ అవుతావని' - 'ఉప్పెన' దర్శకుడు సానా బుచ్చిబాబు. ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చే హీరోలందరూ చిరంజీవి అంత అవ్వాలని కోరుకునేవారు. ఇండస్ట్రీకి వెళ్లేవాళ్లను చిరంజీవిలా ఎదగమని ఆశీర్వదించేవారు. ఇప్పుడు పవన్ అంత ఎదగమని ఆశీర్వదిస్తున్నారు. పవన్ అంత కావాలని కోరుకుంటున్నారు. పవన్ లా అవుతారని అనుకుంటున్నారు. పవన్ స్టార్‌డమ్ గురించి చెప్పడానికి బుచ్చిబాబు మాట్లాడిన మాట కంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? 

లాస్ట్... బట్ నాట్ లీస్ట్! ఫంక్షన్లలో ముఖ్య అతిథులు చివర్లో మాట్లాడతారు. చిరంజీవి 'ఉప్పెన' ప్రీ రిలీజ్ చివర్లో మాట్లాడారు. అప్పుడు వైష్ణవ్ తేజ్ గురించి చెబుతూ శంకర్ దాదా కంటే ముందు కల్యాణ్ తో జానీలో చేశాడు అని చెప్పారు. పవన్ ప్రస్తావన రావడంతో మరోసారి మెగాభిమానులు మురిసిపోయారు. చిరు స్పీచ్ చివర్లో మైత్రీ మూవీ మేకర్స్ స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నదని ఒక్కో హీరో పేరు చెబుతున్న సందర్భంలోనూ పవన్ పేరు వినపడిన మరుక్షణమే అభిమానుల అరుపులు యుట్యూబ్, టీవీల్లో ఈవెంట్ చూస్తున్న ప్రజలకు వినిపించాయి.

ఈ విధంగా 'ఉప్పెన' ప్రీ-రిలీజ్‌లో పవన్ కల్యాణ్ పేరు వినపడిన ప్రతిసారీ ఆడిటోరియమ్ దద్దరిల్లింది. అది చూశాక... 'పవన్ పేరులో కిక్కే వేరప్పా' అని చెప్పక తప్పదు. అదో మాదిరి అభిమాన ఉప్పెన.