పాక్‌లో కల్లోలం.. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పవర్ కట్..
- IndiaGlitz, [Sunday,January 10 2021]
పాకిస్థాన్‌లో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇది కేవలం ఒక్క ఏరియాకు పరిమితమైతే పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు కానీ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పవర్ కట్ అయింది. ఒక్కసారిగా అర్థరాత్రి సమయంలో పవర్ కట్ అవడంతో ప్రజలకు ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా కల్లోలం రేగింది. దీనిపై పాక్ విద్యుత్ శాఖా మంత్రి ఒమర్ అయూబ్ ఖాత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఫ్రీక్వెన్సీ ఒక్కసారిగా పడిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు.
మరోవైపు గుడ్డూ థర్మల్ విద్యుత్ కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా సమస్య తలెత్తిందని ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాక్ ప్రజానీకం తీవ్ర కంగారుకు లోనైంది. వెంటనే జనరేటర్ల కోసం పెట్రోల్, డీజిల్ కొనుగోలు కోసం బంకుల వద్ద బారులు తీరారు. వెంటనే విద్యుత్ శాఖ స్పందించి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించింది. అయితే పాక్‌లో విద్యుత్ అంతరాయాలు జరగడం కొత్తేమీ కాదని తెలుస్తోంది. గతంలోనూ ఇటువంటి ఘటనలు సంభవించినట్టు తెలుస్తోంది.