తెలుగువారి గయ్యాళి అత్తకు తపాలా శాఖ అరుదైన గౌరవం
Send us your feedback to audioarticles@vaarta.com
వీధుల్లో, కుళాయిల వద్ద ఎక్కడైనా మహిళలకు తగాదాలొచ్చినా, అత్తగారి నుంచి కోడలికి వేధింపులు ఎదురైనా వినబడే పేరు సూర్యకాంతం. సినిమాల్లో గయ్యాళి అత్తగా, గడసరి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకాంతం మరణించి రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ఆ పేరు తెలుగువారి నోళ్లలో నానుతూ వుంటుందంటే ఆమె నటన ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. చాతుర్యంతో కూడిన మాటలు.. అంతలోనే వెక్కిరింపు.. ఇంతలోనే పలకరింపు.. కల్లబొల్లి కబుర్లతో ఏడుస్తూ.. అత్త పాత్రలకు సజీవ శిల్పం సూర్యకాంతం. సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు అని స్వయంగా సీనియర్ నటుడు గుమ్మడి అన్నారట.
వెండి తెరపై గయ్యాళిగా నటించే సూర్యకాంతం నిజ జీవితంలో చాలా సున్నిత మనస్కురాలు. తాను తినడమే కాదు.. తన తోటివారికి తానే స్వయంగా వండి కొసరి కొసరి వడ్డించేవారట. 1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో జన్మించిన సూర్యకాంతం.. వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ మహానటి 1994 డిసెంబరు 18న కన్నుమూశారు. ఎన్ని తరాలు మారినా తెలుగుజాతి, తెలుగు సినిమా ఉన్నంతవరకూ గుర్తుండిపోయే అతి తక్కువ మంది నటుల్లో సూర్యకాంతం ఒకరు.
అంతటి సహజనటికి తపాలాశాఖ అరుదైన గౌరవం కల్పించనుంది. సూర్యకాంతం పేరున తపాలాశాఖ ప్రత్యేక కవరు విడుదల చేయనుంది. ఈ నెల 18న దీనిని కాకినాడలో ఆవిష్కరించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి, మేయర్ సుంకర శివప్రసన్న, విశాఖ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ఎం. వెంకటేశ్వర్లు హాజరవనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments