పవన్ సీఎం అయినా ఫర్వాలేదు.. కానీ..: పోసాని
- IndiaGlitz, [Saturday,March 23 2019]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అయినా ఫర్వాలేదు.. తాను అభినందిస్తానని ప్రముఖ డైరెక్టర్ పోసాని కృష్ణమురళీ పేర్కొన్నారు. భీమవరం బహిరంగ సభలో పవన్ వ్యాఖ్యలపై పోసాని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొమన్న పవన్ కళ్యాణ్ ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొడతావా? అంటూ ఒకింత కన్నెర్రజేశారు. కేసీఆర్ భూములు లాక్కుంటున్నారని పవన్ ఆరోపించడం సబబు కాదన్నారు. కేసిఆర్ సెంటు భూమి లాక్కున్నా తాను పవన్‌కు పాధాభివందనం చేస్తానన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలా!?
ఆంధ్రా బిడ్డలను తెలంగాణ వాళ్లు తరిమితరిమి కొడుతుంటే ఎప్పుడు అడ్డుకున్నావ్?. నువ్వు గెలవడం కోసం, ఓట్లు రావడం కోసం తెలంగాణ వాళ్లను నిందిస్తావా?. ఆంధ్రవాళ్లను ఎవరు కొట్టారో ప్రజలకు రుజువు చేయాలి. పవన్ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. తెలంగాణ వాళ్లు ఆంధ్రాకు వచ్చి కొడుతున్నారా?. ఆంధ్రా వాళ్లను కొడుతుంది, చంపుతుంది ఆంధ్రావాళ్లే.
తెలంగాణ వాళ్లను ఎందుకు ఇరికిస్తావ్ పవన్ కళ్యాణ్. ఇవి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కావు. పవన్ చంద్రబాబు వలలో పడ్డారు. చెగువేరా అభిమాని చంద్రబాబు వలలో ఎందుకు పడ్డారు. తెలంగాణ వాళ్లు నిజంగా కొడితే నువ్ వస్తావా. ప్రతి దానికి జగన్‌తో ఎందుకు ముడిపెడతారు అని పవన్‌పై పోసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ఎప్పుడైనా..!
జగన్ ఎప్పుడన్నా తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టారా?. పవన్ మాటలు నన్ను బాధించాయి. నిజాలతై పవన్ ఇలా మాట్లడవచ్చు.కేసీఆర్ ఎక్కడ భూకబ్జాలు చేశాడు?. పవన్ మంచోడు, ఆవేశపరుడు. పవన్ ఆవేశం రాష్ట్రానికి మంచిది కాదు. కేసీఆర్ విషయంలో పవన్ , చంద్రబాబు మాటలను ఆంధ్రావాళ్లు ఎవరూ నమ్మవద్దు. జగన్‌ను తిట్టినా, చంద్రబాబు పొగిడినా ఫర్వాలేదు కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టరాదు. ఒక్క టీ ఇస్తే తెలంగాణ ప్రజలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు.
తెలంగాణలో ఆంధ్రా ప్రజలు క్షేమంగానే ఉన్నారు. ఓట్ల కోసమే పవన్ , చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు అని పోసాని చెప్పుకొచ్చారు.