Posani Krishna Murali : విధేయతకు అందలం.. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళి
- IndiaGlitz, [Thursday,November 03 2022]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి కీలక పదవిని కట్టబెట్టారు. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషణ్ ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ స్థాపించిన నాటి నుంచి సినీ పరిశ్రమ తరపున జగన్‌కు అండగా నిలబడుతున్న వారిలో పోసాని ఒకరు. ఎంతోకాలంగా జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తుడగా వుంటున్న నేపథ్యంలో .. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లకు పోసానికి ఈ కీలక పదవిని కట్టబెట్టారు సీఎం.
జగన్‌పై ఈగ వాలనివ్వని పోసాని :
సినీ పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా, నటుడిగా సత్తా చాటిన పోసాని కృష్ణమురళీ తొలుత ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికి సినిమాలతో బిజీ అయ్యారు. అయితే రాజకీయాల్లోకి రానప్పటికీ జగన్‌కు బయటి నుంచి మద్ధతు పలికారు. జగన్‌ను ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వారిని ఏకిపారేసేవారు పోసాని. జగన్ ముఖ్యమంత్రి కాగానే ఖచ్చితంగా పదవి వచ్చే వారిలో పోసాని పేరు వుంటుందని అంతా భావించారు. కానీ ఎందుకో లేట్ అయ్యింది. కానీ ఎట్టకేలకు కృష్ణమురళికి పదవిని అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం కమెడియన్ అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు పదవిలో వుంటారు.
2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి :
కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తగా ముద్రపడిన అలీ.. 2019 ఎన్నికలకు ముందుకు వైసీపీలో చేరారు. ఆ సమయంలో గుంటూరు వెస్ట్ కానీ, రాష్ట్రంలోని మరేదైనా నియోజకవర్గ టికెట్ లభిస్తుందని అలీ ఆశించారు. కానీ జగన్ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో.. వైసీపీ అభ్యర్ధుల తరపున ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించినా అలీకి ఎలాంటి పదవీ దక్కలేదు. దీంతో మూడేళ్ల పాటు ఆయన వెయిట్ చేశారు. అలీకి పదవి దక్కకపోవడానికి అనేక కారణాలు వున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అలీ అత్యంత ఆప్తుడు, అలాగే తెలుగుదేశం పార్టీలోని నేతలందరితోనూ ఆయనకు సత్సంబంధాలు వున్నాయి. ఈ కారణం చేతే జగన్ దృష్టి అలీ మీదకు వెళ్లలేదని విశ్లేషకులు అంటున్నారు.