ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత.. విషాదంలో చిత్ర పరిశ్రమ
- IndiaGlitz, [Thursday,November 11 2021]
భారతీయ చిత్ర పరిశ్రమను వరుస మరణాలు వెంటాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం నుంచి ఇంకా అభిమానులు కోలుకోలేదు. తాజాగా మరో సినీ ప్రముఖుడు కాలం చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ కూల్ జయంత్ (44) బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన కృషి, పట్టుదలతో నృత్య దర్శకుడి స్థాయికి ఎదిగారు. దిగ్గజ డ్యాన్స్ మాస్టర్లు ప్రభుదేవా, రాజు సుందరం వద్ద డాన్సర్‌గా పని చేసిన కూల్ జయంత్ తన కెరీర్‌లో దాదాపు 800 చిత్రాలకు పైగా డాన్సర్‌గా పని చేశారు. అనంతరం ‘‘ కాదల్ దేశం ’’ చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.
తమిళ, మలయాళ భాషల్లో 100కు పైగా చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలందించారు. మలయాళ అగ్ర హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి వారి చిత్రాలకు కూల్ జయంత్ నృత్య దర్శకత్వం వహించారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న జయంత్ బుధవారం వెస్ట్ మాంబళంలోని తన నివాసంలో కన్నుమూశారు. కూల్ జయంత్ మృతిపై తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నిన్న సాయంత్రం చెన్నైలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి.