GST Theatres:జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం : థియేటర్లలో పాప్‌కార్న్ చూసి ఇక భయపడొద్దు ..లాభాల్లో పీవీఆర్, ఐనాక్స్ షేర్లు
Send us your feedback to audioarticles@vaarta.com
సామాన్యుడు తన కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాలంటే జేబులు గుల్లకావాల్సిందే. సాధారణ థియేటర్ అయితే పర్లేదు కానీ. అదే మల్టీప్లెక్స్ అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకోవాల్సిందేనన్న ఫీలింగ్ ప్రజల్లో వుంది. టికెట్ ధరలు 300 నుంచి రూ.350 వరకు వుండగా.. దీనికి పాప్‌కార్న్ ఇతర ఖర్చులు అదనం. దీంతో చాలామంది థియేటర్ వంక చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఓటీటీల్లో వచ్చే వరకు వెయిట్ చేసి ఇటిల్లిపాది చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారందరికీ జీఎస్టీ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. దీని ప్రకారం హాయిగా పాప్‌కార్న్ చూస్తూ సినిమా చూసేయొచ్చు.
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంపై మల్టీప్లెక్స్ ఆపరేటర్లు హర్షం:
మంగళవారం సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ థియేటర్లలో ఆహార పదార్ధాలపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించింది. దీంతో థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్ సహా ఇతర ఆహార పదార్ధాల ధరలు దిగిరానున్నాయి. దీంతో ప్రేక్షకులతో పాటు థియేటర్ ఆపరేటర్లు పండగ చేసుకుంటున్నారు. ఇకపై మల్టీప్లెక్స్‌లు కళకళలాడతాయని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ ఇక్కడే ఓ మెలిక పెట్టింది. సినిమా టికెట్లు, ఫుడ్‌ను కలిపి బుక్ చేస్తే మాత్రం 5 శాతానికి బదులుగా గతంలో వున్నట్లే 18 శాతం జీఎస్టీ పడుతుందని తెలిపింది. అలా కాకుండా రెండూ విడివిడిగా బుక్ చేసుకుంటే మాత్రం 5 శాతం జీఎస్టీ వేస్తారు. ఈ నిర్ణయాన్ని మల్టీప్లెక్స్‌ల ఓనర్లు స్వాగతిస్తున్నారు.
ఆహార పదార్ధాలతోనే మల్టీప్లెక్స్‌కు ఆదాయం:
నిజానికి మల్టీప్లెక్స్‌లకు వచ్చే ఆదాయంలో సింహభాగం ఆహారానిదే. దాదాపు 35 శాతం ఆదాయం ఫుడ్ అండ్ బేవరేజీల ద్వారానే వస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 9 వేల సినిమా స్క్రీన్లు వున్నాయని అంచనా . నిర్వహణా భారం, ప్రజల రాక తగ్గిపోవడంతో కోవిడ్ తర్వాత వీటిలో చాలా వరకు మూతపడ్డాయి. దీనికి తోడు ఓటీటీ మార్కెట్ విస్తరిస్తూ వుండటంతో థియేటర్లు నడవటం కష్టంగా మారింది. ఈ పరిస్ధితుల్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం థియేటర్ ఇండస్ట్రీకి మేలు కలిగిస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
జీఎస్టీ నిర్ణయంతో పుంజుకున్న పీవీఆర్, ఐనాక్స్ షేర్లు :
మరోవైపు.. సినిమా టికెట్లపై జీఎస్టీ పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో దేశంలో మల్టీప్లెక్స్ రంగాన్ని శాసిస్తున్న పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు పుంజుకున్నాయి. మార్కెట్ వర్గాల ప్రకారం ఈ రెండు సంస్థలు 2 శాతం లాభాలను నమోదు చేశాయి. అటు బీఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజీలో పీవీఆర్ షేర్లు 1.28 శాతం పెరిగి రూ.1,478.40కి చేరుకోగా.. ఐనాక్స్ లీజర్ షేర్లు 1.82 శాతం పెరిగి రూ.291.05 శాతానికి చేరుకున్నాయి. టికెట్ ధరలపై 28 శాతం జీఎస్టీ పన్నును మరోసారి ఆలోచించాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గతంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సినిమా టికెట్ రేట్ల సవరణతో పాటు జీఎస్టీ కౌన్సిల్ ఊరగాయాలు, సాస్‌లు, ఫ్రూట్ ప్రిజర్వ్‌లు, ఇన్సులిన్, జీడిపప్పు, స్కూల్ బ్యాగులు, ప్రింటర్లు, కత్తులు, అగరబత్తీలు సహా 65 ఇతర వస్తువులపై జీఎస్టీ కౌన్సిల్ రేట్లను సవరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments