ఐక్యరాజ్యసమితి అధికారులను కలిసిన పూనమ్ కౌర్

  • IndiaGlitz, [Thursday,October 03 2019]

జాతిపిత మహాత్మాగాంధీ ప్రబోధించిన శాంతి, అహింస మార్గంలో పూనంకౌర్ ప్రయాణిస్తున్నారు. జీవితంలో శాంతి, అహింస మార్గాన్ని ఆమె బలంగా విశ్వసిస్తారు. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. అక్కడి అధికారులను కలిసి గాంధీజీ శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రత్యేక చిత్రపటాలను అందించారు. అధికారులతో కలిసి గాంధీజీ 150వ జయంతిని సెలబ్రేట్ చేశారు.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గారికి గాంధీజీ చిత్రపటాన్ని శాంతి సందేశంగా అందించారు. అలాగే, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో భారత రాయబారి సందీప్ చక్రవర్తిని కలిశారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ వ్యవహారాలు చూసే డిప్యూటీ రిప్రజెంటేటివ్ నాగరాజ్ నాయుడుతో పూనంకౌర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పూనం కౌర్ మాట్లాడుతూ మహాత్ముని 150వ జయంతి రోజున ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత ప్రతినిధులతో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది. సంప్రదాయ కళలు వర్లీ, కలంకారి, మధుబని పద్ధతుల్లో రూపొందించిన గాంధీజీ చిత్రపటాన్ని సయ్యద్ అక్బరుద్దీన్ గారికి అందించాను. ఉన్నతాధికారుల ద్వారా గాంధీజీ గారి ఫస్ట్ పెయింటింగ్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అందజేశాను. ప్రతిరోజు, ప్రతి ఒక్కరి జీవితంలో, మన ఈ ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే ఏం చేస్తే బావుంటుంది అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచనలను అక్బరుద్దీన్ గారితో పంచుకున్నాను. ప్రశాంతంగా ప్రతి విషయాన్ని ఆయన విన్నారు. మహాత్మ గాంధీజీ అనుసరించిన శాంతి మార్గమే మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. జీవితంలో ఆయన నమ్మిన సూత్రాలు, పాటించిన విధానాలు ‌ ఆయన మహాత్ముని చేశాయని నేను నమ్ముతాను. ఆయన జీవన విధానం ప్రతి ఒక్కరూ ఆచరించదగినది. జీవితంలో ప్రతి ఒక్కరికి శాంతి లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. శాంతి, ప్రేమ, మానవత్వంతో ప్రజలందరూ జీవించాలని కోరుకుంటున్నాను. ఈ సందేశం అందరికీ చేరుతుందని ఆశిస్తున్నాను. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేయడం లేదు. నా వంతు సామాజిక బాధ్యతగా ‌చేస్తున్నాను అన్నారు.