తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ ముగిసే నాటికి దాదాపు 75 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారలు వెల్లడించారు. ఇప్పటికే క్యూలో ఉన్న ఓటర్ల ఓట్లు కూడా పోలైన తర్వాత కచ్చితమైన ఓటింగ్ శాతాన్ని ఈసీ తర్వాత ప్రకటించనుంది. ఇక అభ్యర్థుల భవితవ్యం మొత్తం ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. వాటిని ప్రత్యేక నిబంధనల మధ్య సీల్ చేసి.. ఆ ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు.
మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. శాంతి భద్రతలు కాపాడడం కోసం 1.06 లక్షల మంది భద్రతా సిబ్బందిని నియమించింది. అయినప్పటికీ సమస్యాత్మక నియోజకవర్గాలు సహా చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసిపోయింది. అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ జరిగింది.
పోలింగ్ ఉదయం నుంచి మొదలుకాగానే ఎక్కడో ఒక చోట హింసాత్మక ఘటన జరుగుతూనే ఉంది. ముఖ్యంగా మాచర్ల, తిరుపతి, తాడిపత్రి, తెనాలి, నరసరావుపేట వంటి నియోజకవర్గల్లో రాళ్లు విసరురుకోవడం వంటి ఘటనలు జరిగాయి. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనంపైనే దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో సీరియస్ అయిన ఈసీ పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి గత ఎన్నికల్లో ఈసారి రాష్ట్రంలో భారీగా పోలింగ్ నమోదు కావడం విశేషం.
అటు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగియగా.. మిగతా అన్ని స్థానాల్లో ఆరు గంటల వరకు లైన్లలో ఉన్న ఓటర్లందరికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ అత్యల్పంగా నమోదైంది. ఎప్పటిలాగే గ్రేటర్ హైదరాబాద్‌లో ఈసారి కూడా తక్కువ ఓటింగ్ నమోదు అయింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అభ్యర్థుల భవిత్వ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మరి ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో.. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో జూన్ 4వ తేదీన తేలనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments