Political Leaders:రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న రాజకీయ నేతలు.. ఎందుకంటే..?

  • IndiaGlitz, [Friday,February 23 2024]

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మరోసారి ప్రయాణాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై తీవ్ర చర్చ జరుగుతోంది. కారుల్లో ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా అందరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలి. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ఇటీవల రాజకీయ నాయకులు ప్రయాణించే వాహనాలు తరుచుగా ప్రమాదానికి గురవుతున్నాయి. అతి వేగంతో వెళ్లడమే ఈ ప్రమాదాలకు కారణమని పోలీసులు చెబుతున్నారు. అయితే అదృష్టవశాత్తూ సీటు బెల్ట్ పెట్టుకున్న వారు ప్రాణాలతో బయటపడుతుంటే.. పెట్టుకోని వారు కన్నుమూస్తున్నారు.

రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం ఏపీకి చెందిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి(Shaik Sabji)మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏలూరు నుంచి కారులో వెళ్తున్నారు. అయితే అకివీడు వైపు వెళ్తున్న మరో కారు అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జి అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. డ్రైవర్‌, గన్‌మెన్‌, పీఏ తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంగా కారు నడపడంతో పాటు నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది.

ఇటీవల జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ విప్‌,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌(Adluri Laxman) హైదరాబాద్‌లో పనులు ముగించుకుని తన కాన్వాయ్‌తో ధర్మపురి బయలుదేరారు. అయితే జగిత్యాల జిల్లా ఎండపల్లి అంబారిపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సహచరులు స్పల్ప గాయాలతో బోల్తాపడ్డారు. సీటు బెల్టు పెట్టుకోవడం కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పంది. లక్ష్మణ్ తలకు గాయం కాగా వెంటనే మరో వాహనంలో కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

అలాగే ఏపీలోని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi) ప్రయాణిస్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఆయన తన కాన్వాయ్‌తో బయలుదేరారు. సూర్యపేట వద్దకు రాగానే ఆయన కారు అదుపుతప్పింది. వెంటనే కారులోని ఎయిర్‌బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అదృష్టవశాత్తూ రెండు రోడ్డు ప్రమాదాల్లోనూ నేతలు ఇద్దరు సీటు బెల్టు పెట్టుకోవడంతో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో ఇరు నేతల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

టీడీపీ మాజీ ఎంపీ, నందమూరి హరికృష్ణ(Hari Krishna) కూడా రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం విధితమే. ప్రమాదం సమయంలో హరికృష్ణ స్వయంగా కారు నడుపుతున్నారు. అయితే కారు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ఆయన సీటు బెల్ట్ పెట్టుకోవడంతో స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఇలాగే మృతి చెందారు.

వీరితో పాటు చాలా మంది నేతలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాజకీయ నేతలు ఎక్కువగా వివిధ కార్యక్రమాల నిమిత్తం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. త్వరగా గమ్యం చేరాలనే ఉద్దేశంతో వేగంగా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ప్రమాదాల్లో కొంతమంది మరణిస్తే.. మరికొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. అందుకే కారులో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరు సీటు బెల్టు పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.