ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కును బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో వినియోగించుకున్నారు. అంబర్‌పేట పరధిలోని బర్కత్‌పురలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఓటు వేశారు. ఇక బోయినపల్లిలో మంత్రి మల్లారెడ్డి దంపతులు.. శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీ తమ ఓటు వినియోగించుకున్నారు. ఇక పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నారాయణపురంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మంచిర్యాలలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వేంకట స్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బొప్పాపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు.. సూర్యాపేట బూత్ నంబర్ 5లో మంత్రి జగదీష్ రెడ్డి.. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి ఓటు వేశారు.
ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్ రావు సతీసమేతంగా పోలింగ్ బూత్‌కి చేరుకొని ఓటు వేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ ఓటు వేయగా.. పర్వతగిరిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తెలంగాణ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ఓటు వేశారు. ఇలా పార్టీలకు అతీతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు ప్రముఖ రాజకీయ నాయకులు. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని నాయకులు కోరారు.
అంబర్‌పేటలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments