వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న పోలీసోడు

  • IndiaGlitz, [Saturday,April 09 2016]
త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన చిత్రం తెరి. ఈ చిత్రాన్ని రాజా రాణి ఫేం అట్లీ తెర‌కెక్కించారు. ఈ మూవీలో విజ‌య్ స‌ర‌స‌న స‌మంత‌, అమీ జాక్స‌న్ న‌టించారు. ప్ర‌ముఖ హీరోయిన్ మీనా కూతురు నైనిక ఈ చిత్రంలో బాల‌న‌టిగా న‌టించ‌డం విశేషం. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...అట్లీ తెర‌కెక్కించిన రాజా రాణి చిత్రాన్ని చూసిన త‌ర్వాత తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్నాను... కానీ కుద‌ర‌లేదు. డైరెక్ట‌ర్ అట్లీకి రాజా రాణి ఫ‌స్ట్ ఫిల్మ్ అయిన‌ప్ప‌టికీ ఆ చిత్రాన్ని తెర‌కెక్కించిన విధానం నాకు బాగా న‌చ్చింది. లాస్ట్ మంత్ పోలీసోడు ప్రొమోస్ చెన్నైలో చూసాను. రాజా రాణి చూసిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యానో...ఈ పోలీసోడు ప్రొమోస్ చూస్తున్న‌ప్పుడు కూడా అలాగే ఫీల‌య్యాను. అందుక‌నే ఈ చిత్రాన్ని తెలుగులో డ‌బ్ చేసాను. కొత్త‌ద‌నం ఉంది ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు చూపించాలి అని ఫీలైతేనే డ‌బ్ చేస్తాను. గ‌తంలో శంక‌ర్ నిర్మించిన వైశాలి, మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన ఓకే బంగారం చిత్రాలు అలా న‌చ్చ‌బ‌ట్టే డ‌బ్ చేసాను. మ‌న‌కి ఇక్క‌డ బిగ్ స్టార్స్ ఎలాగో అలా...త‌మిళ్ లో విజ‌య్ బిగ్ స్టార్. త‌మిళ సినిమా అయిన‌ప్ప‌టికీ సినిమా న‌చ్చితే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కం ఉంది అన్నారు.
డైరెక్ట‌ర్ అట్లీ మాట్లాడుతూ...రాజా రాణి త‌ర్వాత నేను చేసిన సినిమా ఇది. రాజా రాణి త‌ర్వాత తెలుగులో చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. ఈ సినిమా త‌ర్వాత తెలుగు సినిమా చేస్తాను. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే...పోలీసోడు ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ థ్రిల్ల‌ర్. ఈ చిత్రానికి ప్ల‌స్ పాయింట్ అంటే స‌మంత‌. ఈ చిత్రంలో స‌మంత మిత్ర అనే పాత్ర పోషించింది. ఈ చిత్రంలో డైరెక్ట‌ర్ మ‌హేంద‌ర్ ఓ ముఖ్య‌పాత్ర పోషించారు. పిల్ల‌ల్ని ఎలా పెంచాలి అనేది ఈ చిత్రంలో చూపించాను. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.
హీరోయిన్ స‌మంత మాట్లాడుతూ...మంచి సినిమా ఏ భాష‌లో వ‌చ్చినా చూస్తారు. నేను ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 25 సినిమాల్లో న‌టించాను. నేను న‌టించిన సినిమా రిలీజ్ అవుతుంది అంటే... నాకు ఐదు రోజుల ముందు నుంచి టెన్ష‌న్ మొద‌ల‌వుతుంది. కానీ..ఈ సినిమా స‌క్సెస్ పై నాకు ఎలాంటి టెన్ష‌న్ లేదు. అట్లీ చిన్న వ‌య‌సులోనే డైరెక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ అన్ని విష‌యాల్లో క్లారిటీ ఉంది. ఈ చిత్రంలో ఎమోష‌న్, సెంటిమెంట్, యాక్ష‌న్..అన్నీస‌మ‌పాళ్ల‌లో ఉన్నాయి. పెద్ద హీరో సినిమాలో మంచి పాత్ర దొర‌క‌డం అంత ఈజీ కాదు. కానీ..నాకు ఈ సినిమాలో మంచి పాత్ర పోషించే అవ‌కాశం ల‌భించింది.ఈ చిత్రాన్ని త‌మిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కం ఉంది అన్నారు.