ఏపీలో అత్యవసర ప్రయాణం చేయాలంటే ఇది తప్పనిసరి..
- IndiaGlitz, [Monday,May 10 2021]
ఏపీలో మధ్యాహ్నం 12 తర్వాత నుంచి ఏపీలో కఠినంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కర్ఫ్యూ కారణంగా అత్యవసర ప్రయాణాలకు సైతం ఆటంకం ఎదురవుతోంది. ఈ క్రమంలోనే కర్ఫ్యూ సమయంలో అత్యవసరంగా ప్రయాణించాలనుకొనే వారి కోసం ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. సోమవారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వస్తుందన్నారు. విజయవాడలో కర్ఫ్యూ అమలు తీరును, పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద పరిస్థితులను సీపీ బత్తిన శ్రీనివాసులతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు.
Also Read: సింగర్ సునీతను లైవ్‌లో వాట్సాప్ నంబర్ అడిగిన నెటిజన్..
అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ... అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారికోసం ఈపాస్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నప్పటికీ, అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ప్రస్తుతం ఉన్న ఆంక్షలే కొనసాగుతాయని వెల్లడించారు. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుండటంతో దీని కట్టడిలో భాగంగా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. శుభకార్యాలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తున్నామన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ల వరకూ రావాల్సిన అవసరం లేదని డీజీపీ సవాంగ్ తెలిపారు. ఏపీ పోలీస్ సేవా యాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ హెచ్చరించారు. కరోనాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రజలకు సూచించారు.