Police Son:పోలీస్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. మహిళ మృతి..

  • IndiaGlitz, [Friday,December 01 2023]

అతివేగం అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకం అని పోలీసులు తరుచూ ప్రకటనలు చేస్తూనే ఉంటారు. ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల మీ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని నెత్తి నోరు బాదుకుంటూ ఉంటారు. అయినా కానీ కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. అలాంటిది ఓ పోలీస్ కుమారుడే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఒక్క మహిళ మృతికి కారణమయ్యాడు.

హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటకు చెందిన గాదె జోసెఫ్‌, కవిత భార్యాభర్తలు. వీరిద్దరు గురువారం పోలింగ్ సందర్భంగా స్థానిక సెయింట్‌ గాబ్రియేల్‌ పాఠశాలలో ఓటు వేయడానికి బైక్‌పై వచ్చారు. ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు బైక్‌ ఎక్కుతుండగా ఫాతిమానగర్‌ నుంచి దర్గా వైపు ఓ కారు అతి వేగంగా వచ్చి కవితను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

కారు నెంబర్‌ TS 03 FA 9881 ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడిని ఎక్సైజ్‌ సీఐ కుమారుడు వంశీగా తేల్చారు. మరోవైపు నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మహిళ మృతికి కారణమైన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్‌ చేశారు. కవిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కాజీపేట వంతెన వద్ద శుక్రవారం రాస్తారోకో చేశారు. నిందితుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పడంతో నిరసన విరమించారు.