Ramoji Film City:రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై పోలీస్ కేసు నమోదు.. ఎందుకంటే..?

  • IndiaGlitz, [Friday,January 19 2024]

రామోజీ ఫిల్మ్‌ సిటీ గురించి తెలియని వారుండరు. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే ఈ ఫిల్మ్‌ సిటీ ఎంత పేరు దక్కించుకుందో.. అంతే విమర్శలు కూడా ఎదుర్కొంది. అక్రమంగా భూమి కబ్జా చేసి ఇది కట్టారని గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీ నిర్వాహకులపై పోలీస్ కేసు నమోదైంది. ఇక్కడ జరిగిన ప్రమాదంలో ఓ కంపెనీ సీఈవో మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

అసలు ఏం జరిగిందంటే..?

లైమ్లైట్ గార్డెన్ వద్ద ఫిల్మ్‌ సిటీ విస్టెక్స్‌ కంపెనీ సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌ జరిగింది. ఈ ఫంక్షన్‌లో క్రేన్ ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్ ద్వారా గెస్టును కిందకు దించే ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు కంపెనీ ప్రతినిధులను కిందకు దించుతున్న క్రమంలో ఒక్కసారిగా క్రేన్ వైర్ తెగిపోయింది. దీంతో అందులో ఉన్న వారు ఎత్తు నుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా(56) మరణించగా.. చైర్మన్ విశ్వనాథ్ రాజు(54)కు తీవ్ర గాయాలయ్యాయి.

ఓ వ్యక్తి మృతి.. మరొకరి పరిస్థితి విషమం..

దీంతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇక తీవ్రగాయాలైన విశ్వనాథ్‌ను మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంతమందికి కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనపై జానకీరాం రాజు అనే ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో అబ్దుల్‌పూరామెట్ పోలీస్‌ స్టేషన్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. నిందితులుగా నిర్వాహకులను చేర్చి ప్రశ్నిస్తున్నారు.

ఫిల్మ్ సిటీపై సంచలన ఆరోపణలు..

కాగా ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీ భూముల విషయంలో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఫిల్మ్ సిటీలో రాజవంశీకులకు చెందిన భూములతో పాటు అసైన్డ్‌, రహదారి భూములున్నాయని ఆయన ఆరోపించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలోని 3వేల ఎకరాల భూముల్లో 1700 ఎకరాలు గాలిబ్‌ జంగ్‌కు చెందిన భూములున్నాయని.. అంతేకాకుండా ప్రజా రహదారులు, ఎస్సీ ల్యాండ్స్, భూదాన్‌ భూములను సైతం కబ్జా చేశారంటూ తెలిపారు. అలాగే అనాజ్‌పూర్- ఇబ్రహీంపట్నం రహదారిని మూసేసి కబ్జా చేశారన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 682 మందికి 200 గజాల చొప్పున పట్టాలు ఇవ్వగా లబ్ధిదారులను వారి స్థలాల్లోకి రానివ్వకుండా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇటీవల కాలంలో వివాదాల్లో నిలుస్తున్న రామోజీ గ్రూప్ సంస్థలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి.